సెప్టెంబర్ 5 నుంచి ఏపీలో బడి గంట
రాష్ట్రంలో సెప్టెంబర్ 5 నుంచి పాఠశాలలు
పునః ప్రారంభమవుతాయని ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలిపారు.
మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ఉన్నతాధికారులతో ఆయన సమీక్షా సమావేశం
నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆగస్టు 31
నాటికి పాఠశాలల్లో నాడు-నేడు పనులు పూర్తి కావాలని అధికారులను ఆదేశించారు. కేసులు
పెరుగుతున్నప్పటికీ కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. కరోనా మహమ్మారి కారణంగా
మార్చి రెండో వారం నుంచి ఏపీలో స్కూళ్లు మూతపడ్డాయి. మళ్లీ ఎప్పుడు ఓపెన్ అవుతాయో
అన్న సందిగ్ధతకు జగన్ సర్కార్ తాజాగా తెరదించింది. స్కూళ్ల పున: ప్రారంభానికి
ముహూర్తం ఖరారు చేసింది. సెప్టెంబరు 5 నుంచి స్కూళ్లను తెరుస్తామని ఇప్పటికే
విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. సీఎం జగన్ సైతం ఈరోజు అధికారికంగా
తేదీని ధ్రువీకరించారు. అయితే గడిచిన 24 గంటల్లో ఏపీలో 7,948 మందికి కరోనా
పాజిటివ్ నిర్ధారణ అయ్యాయి. వీటితో కలిపి ఏపీలో మొత్తం కరోనా కేసుల సంఖ్య
1,10,297కి చేరింది. ఇప్పటి వరకు 1,148 మంది మరణించారు. కరోనా నుంచి కోలుకుని
52,622 మంది డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం రాష్ట్రంలో 56,527 యాక్టివ్ కేసులు
ఉన్నాయి. ఇక కరోనా టెస్టుల్లో మాత్రం ఏపీ తన రికార్డు నిలబెట్టుకుంటోంది. తాజాగా
24 గంటల్లో 62,979 శాంపిల్స్‌ను
పరీక్షించారు. ఇందులో 32,100 ర్యాపిడ్ యాంటిజెన్ కరోనా పరీక్షలున్నాయని ఏపీ వైద్య
ఆరోగ్యశాఖ ప్రకటించింది. ఇదిలావుండగా తెలంగాణలో మాత్రం స్కూల్స్ రీఓపెన్ పై
అనిశ్చితి కొనసాగుతోంది. కరోనా తీవ్రతపై ఆ నిర్ణయం ఆధారపడి ఉంటుందని తెలంగాణ సహా పలు
రాష్ట్రాలు స్పష్టం చేశాయి.