Friday, July 17, 2020

Journalist Madhusudhan Reddy dies with Covid-19 in Tirupati

ఏపీలో కరోనాకు మరో జర్నలిస్ట్ బలి
కరోనా వైరస్ కు ఆంధ్రప్రదేశ్ లో మరో జర్నలిస్ట్ బలయ్యారు. ఓటీవీ చానల్ లో విధులు నిర్వహిస్తున్న జర్నలిస్ట్ మధుసూధన్ రెడ్డి కరోనా కారణంగా కన్నుమూశారు. నాలుగు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. కడప జిల్లాకు చెందిన మధుసూధన్ రెడ్డి తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. తిరుపతిలోనే ఈనెల 12న కరోనా తో పార్థసారథి అనే కెమెరామన్ చనిపోయిన సంగతి తెలిసిందే. ఆయన శ్వాస తీసుకోలేని ప‌రిస్థితుల్లో మూడు రోజుల పాటు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతూ ప్రాణాలొదిరారు. ఇప్పటికే తెలంగాణలో ఓ జర్నలిస్ట్ కరోనాకు బలయ్యారు. జూన్ లో మనోజ్ కుమార్ అనే టీవీ జర్నలిస్ట్ ని ఈ మహమ్మారి పొట్టనబెట్టుకుంది. 


Monday, July 13, 2020

Real Ayodhya in Nepal, Ram Not Indian: Nepal PM Oli

రాముడు నేపాలీ: ప్రధాని ఓలి
భారత్ పై మరోసారి నేపాల్ ప్రధాని కె.పి.ఓలి విషం కక్కారు. ఈసారి ఏకంగా రాముడ్ని అడ్డం పెట్టుకుని ఆయన మనదేశాన్ని ఆడిపోసుకున్నారు. భారత్ లోని రామజన్మభూమిగా పేర్కొంటున్న అయోధ్య నకిలీదన్నారు. మన దేశం సాంస్కృతిక దోపిడీకి పాల్పడుతోందని విమర్శలు రువ్వారు. సోమవారం ఆయన నేపాల్ పార్లమెంట్ సమావేశాల్లో పాల్గొన్న అనంతరం ఈ తెంపరితనాన్ని ప్రదర్శించారు. అసలైన రామజన్మభూమి నేపాల్ లోనే ఉందని చెప్పారు. బీర్గంజ్ జిల్లాలోని థోరి శ్రీరాముని జన్మస్థలమని ఓలి పేర్కొన్నారు. సుదీర్ఘకాలం భారత్ కు మిత్రదేశంగా కొనసాగుతున్న నేపాల్..ఓలీ ప్రధానిగా పదవిలోకి వచ్చాక చైనా కన్నుసన్నల్లో నడుస్తూ మనదేశంతో శత్రుత్వం పెట్టుకుంటోంది. లిపులేఖ్, కాలాపానీ, లింపియాధుర ప్రాంతాల్ని ఇటీవల తమ మేప్ లో చేర్చుకుని తమవే ఆ భూభాగాలంటూ నేపాల్ కయ్యానికి కాలుదువ్వుతున్న సంగతి తెలిసిందే.

Wednesday, July 8, 2020

AP CM YS Jagan unveils 'Nalo Natho' book a biography on YSR Written by YSVijayamma

మహానేత రాజన్నకు సీఎం జగన్ ఘన నివాళి
దివంగత ముఖ్యమంత్రి జననేత వై.ఎస్.రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. వై.ఎస్.ఆర్ 71వ జయంతి సందర్భంగా బుధవారం ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద పుష్పాంజలి ఘటించిన సీఎం జగన్ అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడ నిర్వహించిన ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి మంగళవారం సాయంత్రమే అమరావతి నుంచి ఇడుపులపాయ చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో కుటుంబసభ్యులు, ప్రజాప్రతినిధులకు మాత్రమే ప్రవేశం కల్పించారు. కరోనా నెగెటివ్ పత్రాలు ఉన్న వారినే పోలీసులు సీఎం పాల్గొనే కార్యక్రమాల్లో అనుమతించారు. ఈ సందర్భంగా మహానేత సతీమణి విజయమ్మ ఆయనపై రాసిన `నాలో..నాతో..వైఎస్ఆర్` పుస్తకాన్ని జగన్ ఆవిష్కరించారు. నాన్న వై.ఎస్. లో ఉన్న మంచి వ్యక్తిని, వక్తను, తన జీవనగమనంలో చూసిన విధానాన్ని అమ్మ విజయమ్మ ఈ పుస్తక రూపంలో జనం ముందుకు తీసుకువచ్చారని జగన్ అన్నారు. నాన్న జయంతిని పురస్కరించుకుని ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం తనకెంతో సంతోషంగా ఉందని పేర్కొన్నారు. 37 ఏళ్ల సహచర్యంలో తన భర్త వై.ఎస్.లో చూసిన గొప్ప గుణాలు, మూర్తిభవించిన మానవత్వాన్ని ప్రజలతో పంచుకునేందుకే ఈ పుస్తకాన్ని రాసినట్లు విజయమ్మ తెలిపారు.

Sunday, July 5, 2020

Punjab: 10 people fall sick after eating ‘parsad’ allegedly ‘laced with some poisonous substance’

పంజాబ్ గురుద్వారాలో విషాహారం: 10 మందికి తీవ్ర అస్వస్థత
పంజాబ్ లో విషాహారం తిని 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవల మరణించడంతో ఇంట్లో దినకర్మ నిర్వహించారు. ప్రార్థనలు (సుఖ్మాణి సాహిబ్) నిర్వహించిన తర్వాత బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. అనంతరం రఘువీర్ ఆహారపదార్థాలను (ప్రసాద వితరణ) తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు. అక్కడున్న భక్తులు ఈ భోజనాలు తిన్న వెంటనే అనారోగ్యానికి  గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో పాటు కొందరు స్పృహ కోల్పోయారు. వెంటనే వీరందర్ని స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న ముగ్గుర్ని హుటాహుటిన అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రికి  తరలించారు. అయితే ఇంట్లో ఈ ప్రసాదాలను తిన్న వారెవరూ అస్వస్థతకు గురికాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి గురుద్వారాకు తీసుకెళ్లిన ఆహారంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.