పంజాబ్ గురుద్వారాలో విషాహారం: 10 మందికి తీవ్ర అస్వస్థత
పంజాబ్ లో విషాహారం తిని 10 మంది ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో ముగ్గురి
పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రఘువీర్ సింగ్ అనే వ్యక్తి తల్లి ఇటీవల
మరణించడంతో ఇంట్లో దినకర్మ నిర్వహించారు. ప్రార్థనలు (సుఖ్మాణి సాహిబ్)
నిర్వహించిన తర్వాత బంధుమిత్రులకు భోజనాలు పెట్టారు. అనంతరం రఘువీర్
ఆహారపదార్థాలను (ప్రసాద వితరణ) తార్న్ తరణ్ గురుద్వారాకు తీసుకెళ్లారు. అక్కడున్న
భక్తులు ఈ భోజనాలు తిన్న వెంటనే అనారోగ్యానికి
గురయ్యారు. వాంతులు చేసుకోవడంతో పాటు కొందరు స్పృహ కోల్పోయారు. వెంటనే వీరందర్ని
స్థానిక ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమంగా ఉన్న
ముగ్గుర్ని హుటాహుటిన అమృతసర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఇంట్లో ఈ ప్రసాదాలను తిన్న
వారెవరూ అస్వస్థతకు గురికాలేదని తెలుస్తోంది. దీన్ని బట్టి గురుద్వారాకు
తీసుకెళ్లిన ఆహారంలో విషం కలిసి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.