కరో(డా)నా దెబ్బకు ఐపీఎల్ వాయిదా?
ఏటా యావత్ ప్రపంచ క్రికెట్ అభిమానుల్ని ఉర్రూతలూగిస్తున్న ఇండియన్
ప్రిమియర్ లీగ్ (ఐపీఎల్) క్రికెట్ సీజన్ కరో(డో)నా మహమ్మారి ధాటికి ఈసారి వాయిదా పడే
అవకాశాలు కనిపిస్తున్నాయి. జులైలో ప్రారంభం కావాల్సిన టోక్యో ఒలింపిక్స్ సైతం సందిగ్ధంలో
పడిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది చివరి నాటికైనా విశ్వ క్రీడలు నిర్వహించగలమని జపాన్
ఒలింపిక్స్ మంత్రి సీకో హషిమొటో ఇటీవల ఆశాభావం వ్యక్తం చేశారు. తాజాగా ఐపీఎల్ మ్యాచ్ లకు కోవిడ్-19
(కరోనా) సెగ తగిలే ప్రమాదమే ఎక్కువగా కనిపిస్తోంది. ఈ మార్చి 29 నుంచి భారత్ లోనే ఐపీఎల్
సీజన్ 2020 ఆరంభం కావాల్సి ఉంది. భారత క్రికెట్ నియంత్రణా మండలి (బీసీసీఐ) ఈసరికే ఏర్పాట్లు
పూర్తి చేసింది. అయితే స్వదేశీ క్రికెటర్లతో పాటు ఎక్కువ సంఖ్యలో విదేశీ ఆటగాళ్లు ఐపీఎల్
పాల్గొంటుంటారు. చైనాలో ప్రబలి ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిని ఆటాడుకుంటున్న కరోడా
వైరస్ తాజాగా భారత్ లో ఉనికి చాటుతోంది. చైనాలో ఈ వైరస్ నెమ్మదించినా దక్షిణకొరియాను
అతలాకుతలం చేస్తోంది. అదే విధంగా వేసవి ప్రారంభంలో భారత్ లోనూ పదుల సంఖ్యలో పాజిటివ్
కేసులు నమోదవుతుండడం భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ క్రికెట్
బోర్డు అప్రమత్తమయింది. ఐపీఎల్ తాజా సీజన్ లో ఆ దేశం క్రికెటర్లు కేన్ విలియమ్సన్
(సన్రైజర్స్ హైదరాబాద్), జిమ్మీ నీషమ్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్),లూకీ ఫర్గూసన్ (కోల్కతా
నైట్రైడర్స్),మిచెల్ మెక్లనగాన్, (ముంబయి ఇండియన్స్),ట్రెంట్ బౌల్ట్ (ముంబయి ఇండియన్స్),మిచెల్
శాంట్నర్ (చెన్నై సూపర్ కింగ్స్) తదితర మొత్తం ఆరుగురు అగ్రశ్రేణి క్రికెటర్లు ఆడనున్నారు.
దాంతో భారత్లో కరోనా వైరస్ వ్యాప్తిపై సమాచారం సేకరిస్తున్న కివిస్ క్రికెట్ బోర్డు
తమ క్రికెటర్లకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తోంది. ఇతర దేశాల క్రికెట్ బోర్డులు ఈ
విషయంపై దృష్టి సారించాయి. భారత్ లో కరోనా ప్రభావం పూర్తిగా సమసిపోతేనే ఐపీఎల్ 2020
సీజన్ సజావుగా సాగుతుందని క్రీడా పండితుల భావన.