`మహా` కేబినెట్ లో అజిత్ పవార్, ఆదిత్య ఠాక్రే
మహారాష్ట్ర మంత్రివర్గంలో అజిత్ పవార్,
ఆదిత్య ఠాక్రేలకు చోటు లభించింది. రాజ్ భవన్ లో సోమవారం జరిగిన కార్యక్రమంలో వీరిద్దరితో
పాటు నాసిక్ రావు తిర్పుడే, సుందరరావు సోలంకీ, రామ్ రావ్ అదిక్, గోపినాథ్ ముండే,
ఆర్.ఆర్.పాటిల్, విజయ్ సింహ్ మిమితే పాటిల్ తది రులతో గవర్నర్ బి.ఎస్.కోష్యారీ
ప్రమాణం చేయించారు. దారితప్పినా మళ్లీ శరద్ పవార్ తంత్రంతో ఎన్సీపీ గూటికి చేరిన ఆ
పార్టీ అగ్రనేత అజిత్ పవార్ మరోసారి ఉపముఖ్యమంత్రిగా పీఠమెక్కారు. 32 రోజుల
క్రితం కొలువుదీరిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ సంకీర్ణ సర్కార్ లో కేబినెట్ సంఖ్య
36కు చేరింది. ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే `మహా వికాస్ అగాడి`(కూటమి)కి నేతృత్వం
వహిస్తున్న సంగతి తెలిసిందే. నెల్లాళ్ల క్రితం హడావుడిగా అధికారానికి వచ్చిన బీజేపీ
సర్కార్ లో 60 ఏళ్ల అజిత్ పవార్ డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేశారు. 80 గంటల పాటు
పదవిలో ఉన్నారు. అప్పటి దేవేంద్ర ఫడ్నవిస్ సర్కారు బలనిరూపణకు నిలువలేక రాజీనామా
చేయడంతో ఆయన పదవి కోల్పోయారు. తిరిగి బాబాయ్ శరద్ పవార్ పంచనే చేరిన అజిత్ పవార్
మళ్లీ డిప్యూటీ సీఎంగా పదవీ ప్రమాణం చేశారు. అజిత్ పవార్ డిప్యూటీ గా పదవిలోకి
రావడం ఇది నాల్గోసారి. తొలిసారి 2010 నవంబర్ లో ఆ తర్వాత అక్టోబర్ 2012లో ఇటీవల నవంబర్
2019లో మళ్లీ డిసెంబర్ 2019లో అజిత్ పవార్ ఉపముఖ్యమంత్రిగా పదవిని చేపట్టారు. కాగా
ఠాక్రేల వారసుడు ఆదిత్య ఠాక్రే కు తండ్రి ఉద్ధవ్ ఠాక్రే కేబినెట్ లో తాజాగా చోటు
దక్కింది.