స్మృతి ఇరానీ
ఇంటి ఎదుట నిరసన జ్వాల
ఢిల్లీ మహిళా కమిషన్
(డి.సి.డబ్ల్యు) చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ కు మద్దతు తెలుపుతూ నగర యువత మంగళవారం
కదం తొక్కారు. కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో
చేరుకున్న యువతీయువకులు ధర్నాకు దిగారు. ఆమెను కలవాలని పట్టుబట్టారు. గేట్ల వద్ద
మోహరించిన సెక్యూరిటీ సిబ్బందితో పెద్ద
ఎత్తున వాగ్వాదానికి దిగారు. రేపిస్టులకు
ఆర్నెల్ల లోపు ఉరిశిక్ష విధించాలని గత ఎనిమిది రోజులుగా స్వాతి నిరాహార దీక్ష చేస్తున్నా
ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నినాదాలు చేశారు. `అత్యాచారదోషుల్ని ఉరి తీయాలి`..
`ఆరునెలల్లో మరణశిక్ష విధించాలి` అని ఖాళీ పళ్లాలపై రాసిన నినాదాల్ని
ప్రదర్శించారు. రేపిస్టుల్ని సత్వరం ఉరికంబం ఎక్కించాలని నిరశన తెల్పుతున్న స్వాతి
ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి
వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. మంత్రి ఇరానీ ఇంట్లో లేరని భద్రత సిబ్బంది
వారిస్తున్నా ఆందోళనకారులు పట్టువీడకుండా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. పరిస్థితిని
అదుపు చేసేందుకు పలువురు ఆందోళనకారుల్ని అక్కడ నుంచి బస్సుల్లో మందిర్ మార్గ్
పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా మరికొందరు ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో
పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో
మంత్రి కార్యాలయ అధికారి ఒకరు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఈ విషయాన్ని సత్వరం ఆమెకు
చేరవేస్తామని హామీ ఇచ్చి వారికి నచ్చచెప్పారు. దాంతో శాంతించిన నిరసనకారులు ధర్నాను
విరమించారు.