ప్రచార శంఖం పూరించిన శరద్ పవార్
మహారాష్ట్ర దిగ్గజ రాజకీయ నాయకుడు శరద్ పవార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచార
శంఖం పూరించారు. గురువారం ఆయన తమ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అభ్యర్థి
గెలుపు కోసం జునార్ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ
సందర్భంగా ఆయన భారతీయ జనతా పార్టీ పై విరుచుకుపడ్డారు. బీజేపీ నేతలు అధికార
దుర్వినియోగానికి పాల్పడుతూ ప్రతిపక్ష నాయకులే లక్ష్యంగా వారిని సీబీఐ, ఈడీ
కేసుల్లో ఇరికిస్తున్నారని తాజాగా మాజీ కేంద్ర మంత్రి చిదంబరాన్ని తీహార్ జైలు పాలు
చేశారని విమర్శించారు. అభివృద్ధిని విస్మరించడమే కాక రాజకీయ మైలేజ్ వచ్చే అంశాలపైనే ఆ పార్టీ నేతలు
దృష్టి సారించారని ఆరోపించారు. అక్టోబర్ 21 న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
జరగనుండగా పవార్ తన మొదటి ఎన్నికల ర్యాలీలో ప్రసంగించారు. రాష్ట్రంలో బీజేపీ
సంకీర్ణ పాలన ఘోరంగా ఉందని ఫడ్నవిస్ జమానాలో శాంతిభద్రతల పరిస్థితి వెంటిలేటర్
పైకి చేరుకుందని ఘాటుగా విమర్శలు గుప్పించారు.ప్రధాని
నరేంద్రమోదీ పెద్ద నోట్లను అనాలోచితంగా రద్దు చేయడం అనంతరం జీఎస్టీ కొరడా
ఝళిపించడంతో వ్యాపార, వాణిజ్యరంగాలు
దెబ్బతిన్నాయని దేశ ఆర్థికవ్యవస్థ ఛిన్నాభిన్నమైందని పవార్ వ్యాఖ్యానించారు. నల్లధనం వెలికితీత మాట అటుంచి దేశంలోని ప్రతి
వ్యక్తి నోట్ల కోసం సతమతమయ్యారన్నారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి ఎన్సీపీ
పోరాడి గణనీయమైన ఫలితాలు సాధిస్తుందని పవార్ ధీమా వ్యక్తం చేశారు.