ఢిల్లీ-ముంబయి ఎయిర్
ఇండియా విమానంపై గాంధీజీ బొమ్మ
మహాత్మాగాంధీ
150 జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని ఎయిర్ ఇండియా తన విమానంపై బాపూజీ బొమ్మను
చిత్రీకరించి నడుపుతోంది. బుధవారం మధ్యాహ్నం 1 గంటకు న్యూఢిల్లీ నుంచి బయలుదేరి ముంబయి
చేరుకున్న ఎయిర్ ఇండియా విమానం వెనుక భాగంలో ఉన్న గాంధీజీ పెయింటింగ్ ప్రయాణికుల్ని
ఆకట్టుకుంది. సుమారు 11 అడుగుల పొడవు, 4.9 అడుగుల వెడల్పుతో గాంధీజీ పెయింటింగ్ ను
ఈ ఢిల్లీ-ముంబయి ఎయిర్ ఇండియా విమానంపై అందంగా చిత్రీకరించారు. ఎయిర్ ఇండియా లోగో
కింద చిత్రీకరించిన గాంధీజీ పెయింటింగ్ చూపరుల్ని ఆకర్షిస్తోంది.
ఈ ఏడాది ఆరంభంలో ఎయిర్ లైన్స్ హౌస్ మెయింటెనెన్స్ సిబ్బంది ఈ బొమ్మ చిత్రీకరణ
ప్రారంభించి పూర్తి చేశారు. ఇదిలావుండగా సెంట్రల్ రైల్వే జోన్ (ముంబయి ప్రధాన
కేంద్రం) లోని డీజిల్ రైల్వే ఇంజన్లపై ఇదేవిధంగా మహాత్ముని బొమ్మను చిత్రీకరించారు.
22 లోకోమోటివ్ ఇంజన్లకు ఒకవైపున గాంధీ బొమ్మలను పెయింటింగ్ చేశారు. జాతీయ పతాకం పై
అందంగా బాపూజీ బొమ్మను చిత్రీకరించి ఆ ఇంజన్లతో కూడిన రైళ్లను సెంట్రల్ రైల్వే
జోన్లో ఈరోజు నడుపుతున్నారు.