Saturday, September 21, 2019

UP farmers stopped at Delhi border


ఢిల్లీలో యూపీ రైతుల ర్యాలీ అడ్డగింత
తమ సమస్యల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసేందుకు ర్యాలీగా బయలుదేరిన ఉత్తరప్రదేశ్ రైతుల్ని పోలీసులు ఢిల్లీ లోని వివిధ ప్రాంతాల్లో నిలిపివేశారు. యూపీలోని నోయిడా నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కిసాన్ సంఘటన్ కు చెందిన రైతులు శనివారం ర్యాలీ ప్రారంభించారు. చెరకు బకాయిల చెల్లింపు, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, వ్యవసాయ రుణ వితరణల కోసం రైతులు తమ గోడును కేంద్ర మంత్రితో వెళ్లబోసుకునేందుకు బయలుదేరారు. ఘాజీపూర్ సరిహద్దుల నుంచి జాతీయ రహదారులు నం.9, నం.24 గుండా వేల సంఖ్యలో రైతులు ర్యాలీ తీయడంతో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఏదో విధంగా వివిధ మార్గాల్లో రైతునేత దివంగత మాజీ ప్రధాని చరణ్ సింగ్ సమాధి ప్రాంతం కిసాన్ ఘాట్ చేరుకున్న రైతుల్ని పోలీసులు నిలిపివేశారు. ఇందిరాపురం, ఆనంద్ విహార్ తదితర ప్రాంతాల్లో రైతు ర్యాలీల్ని పోలీసులు భగ్నం చేసి వారిని ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతకుముందు నోయిడాలో ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు విఫలం కావడంతో రైతులు ఛలో ఢిల్లీ ర్యాలీ తీయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే మంత్రితో భేటీకి రైతు సంఘం ప్రతినిధులకు అధికారులు అనుమతి ఇచ్చారు. రైతుల ర్యాలీ సందర్భంగా పోలీసులు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

Friday, September 20, 2019

Motor cyclist dies after being hit by train


రైలు ఢీకొని బైకర్ దుర్మరణం
కోల్ కతాలో మోటారు బైక్ పై ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి రైలు ఢీకొట్టగా దుర్మరణం పాలయ్యాడు. శుక్రవారం ఉదయం ఈ దుర్ఘటన జరిగినట్లు ఆగ్నేయ రైల్వే జోన్ అధికారులు తెలిపారు. కోల్ కతా నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన ఈస్ట్ కోస్ట్ ఎక్స్ ప్రెస్ చక్రాల కింద బైక్ నలిగిపోగా బైకర్ అక్కడికక్కడే చనిపోయినట్లు సమాచారం. కోల్ కతా నుంచి రైలు బయలుదేరి 9 కిలోమీటర్లు ప్రయాణించిన అనంతరం సత్రాగచి సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రైల్వే ట్రాక్ ను ఆనుకుని నియంత్రణదారు లేని చోట కాలిబాట మార్గంలో బైకర్ రైలు వస్తున్నా దాటేయొచ్చనే తలంపుతో బైక్ ను నడిపి ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఉదయం 11.45 సమయంలో రైలు దూసుకువస్తుండగా బైకర్ వాహనంతో సహా దాని చక్రాల కింద చిక్కుకుపోయి దుర్మరణం చెందినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడి వివరాలు తెలియరావాల్సి ఉంది.

Thursday, September 19, 2019

NDRF set to induct women personnel


వచ్చే ఏడాది నాటికి ఎన్డీఆర్ఎఫ్ లోకి మహిళలు
జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్) లోకి మహిళల ప్రవేశం షురూ కానుంది. వచ్చే ఏడాది నాటికి కొత్తగా ఏర్పాటుకానున్న నాలుగు బెటాలియన్లలో మహిళల్ని చేర్చుకోనున్నట్లు ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ (డీజీ) ఐపీఎస్ ఎస్.ఎన్.ప్రధాన్ ప్రకటించారు. 2018 నుంచి మహిళా సభ్యుల్ని చేర్చుకోవాలనే యోచన ఊపందుకుందన్నారు. పశ్చిమబెంగాల్ లోని హరింఘాటలో గల ఎన్డీఆర్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ క్యాంపస్ లో రెండో బెటాలియన్ ను ప్రధాన్ ఇటీవల ప్రారంభించారు. ప్రధానంగా సౌకర్యాల లేమీ వల్లే గతంలో మహిళా సిబ్బందిని చేర్చుకోలేకపోయామన్నారు. కొన్ని లోటుపాట్లున్నా ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అన్ని మౌలికసదుపాయాల్ని కల్పించగల స్థితిలోకి వచ్చిందని అందుకే ఇప్పుడున్న 12 బెటాలియన్లకు అదనంగా మరో నాలుగు కొత్త బెటాలియన్లు ఏర్పాటు చేయదలిచామని చెప్పారు. జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, దేశ రాజధాని ఢిల్లీ పరిధిలో ఈ కొత్త బెటాలియన్లను ఏర్పాటు చేయనున్నామన్నారు. ఈ కొత్త బెటాలియన్లకు మహిళా సిబ్బందిని పంపాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాల్ని, ఇతర సాయుధ దళాల్ని ఎన్డీఆర్ఎఫ్ కోరుతోంది. ఎన్డీఆర్ఎఫ్ ఒక్కో బెటాలియన్ లో 1,150 మంది సిబ్బంది ఉంటారు. కొత్త సిబ్బందిని చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వం అసోం రైఫిల్స్, ది ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) లకు ఆదేశాలు జారీ చేసింది. ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటుకు 2005లో బీజం పడింది. ఇందుకుగాను ప్రకృతి విపత్తుల నిరోధక కార్యనిర్వహణ చట్టం చేశారు. 2006లో న్యూఢిల్లీ కేంద్రంగా కేంద్ర హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఎన్డీఆర్ఎఫ్ ఏర్పాటయింది. బాధితుల సంరక్షణ, వెన్నుదన్నుగా నిలవడం అనే ప్రధాన ధ్యేయంతో ఎన్డీఆర్ఎఫ్ పని చేస్తోంది. ప్రకృతి వైపరీత్యాలు, మానవ తప్పిదాల వల్ల ప్రమాదాలు, భయానక పరిస్థితుల్లో చిక్కుకున్న బాధితుల రక్షణ, సహాయక చర్యల్లో ఎన్డీఆర్ఎఫ్ నాటి నుంచి ఇతోధిక సేవలందిస్తోంది.

Wednesday, September 18, 2019

Ghulam Nabi Azad, Ahmed Patel meet Chidambaram in Tihar jail


చిదంబరాన్ని తీహార్ జైలుకు వెళ్లి కలిసిన గులాంనబీ, అహ్మద్ పటేల్
తీహార్ జైలులో ఉన్న మాజీ మంత్రి చిదంబరాన్ని బుధవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్, చిదంబరం తనయుడు కార్తీలు కలిశారు. ఐ.ఎన్.ఎక్స్. మీడియా ముడుపుల కేసులో చిదంబరం అరెస్టయి సెప్టెంబర్ 5 నుంచి తీహార్ జైలులో ఉన్నారు. సోమవారమే చిదంబరం 74వ పుట్టినరోజు జరుపుకున్నారు. చిదంబరం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని జైలు ప్రధాన ఆవరణలో ఆయనను కలిసినట్లు గులాంనబీ తెలిపారు. అర్ధగంట సేపు చిదంబరంతో భేటీ అయిన కాంగ్రెస్ నేతలు గులాంనబీ అజాద్, అహ్మద్ పటేల్ లు తాజా రాజకీయ పరిణామాల్ని ఆయనతో చర్చించారు. దేశ ఆర్థిక పరిస్థితులు, రానున్న ఆయా రాష్ట్రాల ఎన్నికలు, జమ్ముకశ్మీర్ లో ప్రస్తుత పరిమాణాలపై కాంగ్రెస్ సీనియర్ నాయకుల త్రయం చర్చించినట్లు తెలుస్తోంది.