ఢిల్లీలో యూపీ
రైతుల ర్యాలీ అడ్డగింత
తమ
సమస్యల పరిష్కారానికి కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ను కలిసేందుకు
ర్యాలీగా బయలుదేరిన ఉత్తరప్రదేశ్ రైతుల్ని పోలీసులు ఢిల్లీ లోని వివిధ ప్రాంతాల్లో
నిలిపివేశారు. యూపీలోని నోయిడా నుంచి పెద్ద సంఖ్యలో భారతీయ కిసాన్ సంఘటన్ కు
చెందిన రైతులు శనివారం ర్యాలీ ప్రారంభించారు. చెరకు బకాయిల చెల్లింపు, విద్యుత్
ఛార్జీల తగ్గింపు, వ్యవసాయ రుణ వితరణల కోసం రైతులు తమ గోడును కేంద్ర మంత్రితో వెళ్లబోసుకునేందుకు
బయలుదేరారు. ఘాజీపూర్ సరిహద్దుల నుంచి జాతీయ రహదారులు నం.9, నం.24 గుండా వేల సంఖ్యలో
రైతులు ర్యాలీ తీయడంతో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు. ఏదో విధంగా వివిధ మార్గాల్లో రైతునేత
దివంగత మాజీ ప్రధాని చరణ్ సింగ్ సమాధి ప్రాంతం కిసాన్ ఘాట్ చేరుకున్న రైతుల్ని పోలీసులు నిలిపివేశారు. ఇందిరాపురం, ఆనంద్ విహార్
తదితర ప్రాంతాల్లో రైతు ర్యాలీల్ని పోలీసులు భగ్నం చేసి వారిని ముందుకు
వెళ్లకుండా అడ్డుకున్నారు. అంతకుముందు నోయిడాలో ప్రభుత్వ ప్రతినిధులతో చర్చలు
విఫలం కావడంతో రైతులు ఛలో ఢిల్లీ ర్యాలీ తీయడంతో ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అయితే మంత్రితో భేటీకి రైతు సంఘం ప్రతినిధులకు అధికారులు అనుమతి ఇచ్చారు. రైతుల ర్యాలీ సందర్భంగా పోలీసులు దేశ రాజధానిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.