ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ అగ్ని ప్రమాదం
ఢిల్లీ రైల్వేస్టేషన్
లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కేరళ ఎక్స్ ప్రెస్ రైలు బోగిలో అగ్నికీలలు వ్యాపించడంతో
స్టేషన్ లో కలకలం రేగింది. కేరళకు బయలుదేరిన చండీగఢ్-కొచువల్లి
(నం.12218) ఎక్స్ ప్రెస్ విద్యుత్ సరఫరాకు సంబంధించిన (పవర్ కార్) బోగిలో
ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని సమాచారం. అయితే
ఒకరు గాయపడినట్లు ఉత్తర రైల్వే అధికార ప్రతినిధి దీపక్ కుమార్ తెలిపారు. ప్లాట్
ఫారం నం.8 నుంచి రైలు కదిలిన కొద్ది క్షణాల్లోనే ఉవ్వెత్తున మంటలు ఎగసిపడినట్లు
ప్రత్యక్ష సాక్షుల కథనం. ఈ ఘటన శుక్రవారం మధ్యాహ్నం 1.40 కి చోటు చేసుకున్నట్లు
తెలుస్తోంది. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలు
వ్యాపించకుండా అదుపు చేశారు. 12 అగ్నిమాపక శకటాలు ప్లాట్ ఫారంపైకి చేరుకుని బోగిలో
చెలరేగిన మంటల్ని ఆర్పివేసినట్లు అగ్నిమాపక శాఖాధికారి ఒకరు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.