Thursday, September 5, 2019

SC allows Mehbooba Mufti's daughter to meet her in Kashmir


మెహబూబాను కలుసుకునేందుకు కూతురికి సుప్రీం అనుమతి
జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలుసుకునేందుకు ఆమె కూతురు ఇల్తిజాకు గురువారం సుప్రీంకోర్టు అనుమతిని ఇచ్చింది. రాష్ట్రంలో స్వయంపత్రిపత్తిని రద్దు (370 అధికరణ) చేస్తూ కేంద్రప్రభుత్వ నిర్ణయం వెలువడిన దరిమిలా ముఫ్తీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ గృహ నిర్బంధంలో ఉంచారు. ఆగస్ట్ 5న ప్రకటన వెలువడిన కొన్ని గంటల తర్వాత ముఫ్తీ మాట్లాడుతూ కశ్మీర్ ను కొంత భాగం పాకిస్థాన్ ఆక్రమిస్తే ప్రస్తుత భూభాగాన్ని భారత్ ఆక్రమించిందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో అరెస్టయి గృహనిర్బంధంలో ఉన్న ఆమెను కలుసుకోవడానికి అనుమతినివ్వాలని ఇల్తిజా సుప్రీంకోర్టును అభ్యర్థించారు. నెలరోజులుగా తన తల్లిని చూడలేదని ఆమె ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నామని ఇల్తిజా పిటిషన్ దాఖలు చేశారు. ప్రధానన్యాయమూర్తి (సీజేఐ) రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఆమె పిటిషన్ ను విచారించి ఈ మేరకు అనుమతి మంజూరు చేసింది. శ్రీనగర్ లో గల తన నివాసంలో ముఫ్తీని కలుసుకోవడానికి ప్రభుత్వం ఆంక్షలు విధించలేదని తెలిపింది. అయితే కలుసుకున్నాక బయట స్వేచ్ఛగా తిరగరాదనేది ప్రభుత్వ వాదనగా పేర్కొంది.

Wednesday, September 4, 2019

Madame Tussauds Singapore unveils Sridevi`s wax figure


సింగపూర్ లో శ్రీదేవి మైనపు బొమ్మ ఆవిష్కరణ
మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మ్యూజియంలో ఆలిండియా స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి మైనపు ప్రతిమను బుధవారం ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆమె భర్త, బాలీవుడ్ దర్శక నిర్మాత బోనీకపూర్, కూతుళ్లు జాన్వీ, ఖుషీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్ట్ 13న ఆమె జయంతిని పురస్కరించుకుని ఈ మైనపు బొమ్మ తయారీని సంకల్పించినట్లు టుస్సాడ్స్ సింగపూర్ శాఖ వర్గాలు తెలిపాయి. `మిస్టర్ ఇండియా` చిత్రంలో ఆమె ధరించిన పాత్ర నమూనాలో ఈ ప్రతిమను తీర్చిదిద్దారు. 1987 లో విడుదలయిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో `హవా హవాయి` అనే గీతం కూడా జనరంజకమయింది. ఆ పాటలో శ్రీదేవి ధరించిన దుస్తులు, మేకప్ మాదిరిగా బొమ్మను రూపొందించారు. స్వర్ణ వర్ణ కాంతులతో కూడిన మీగడ రంగు దుస్తులు, తలపై కిరీటం, చేతులకు కంకణాలతో అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన శ్రీదేవి మైనపు బొమ్మ సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. దిగ్గజ నటి శ్రీదేవి ప్రతిమ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె కుటుంబసభ్యులు పాల్గొనడం పట్ల టుస్సాడ్స్ సింగపూర్ మ్యూజియం అధికారులు ట్విటర్ లో హర్షం వ్యక్తం చేశారు.

Tuesday, September 3, 2019

3 CISF personnel among 4 killed in fire at ONGC plant; 3 hurt

ఓఎన్జీసీ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం:నలుగురి దుర్మరణం

నవీ ముంబయిలోని ఓఎన్జీసీ చమురు, సహజవాయువు శుద్ధి కర్మాగారంలో మంగళవారం చోటు చేసుకున్న అగ్నిప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా కాలిన గాయాలపాలయ్యారు. చనిపోయిన వారిలో ముగ్గురు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సి.ఐ.ఎస్.ఎఫ్) సిబ్బంది కాగా ప్లాంట్ కు చెందిన ఒకరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. గాయపడిన ముగ్గురు కూడా సి.ఐ.ఎస్.ఎఫ్.కు చెందిన వారేనన్నారు. నవీ ముంబయికి 50 కి.మీ. దూరాన గల ఉరాన్ లోని ప్లాంట్ లో అగ్నిప్రమాదం ఉదయం 6.47కు జరిగినట్లు సమాచారం. ఓ యూనిట్ పైప్ లైన్  లో గ్యాస్ లీకై రాజుకున్న నిప్పుతో రెండుగంటల్లోనే మొత్తం ప్లాంట్ దగ్ధమైనట్లు తెలుస్తోంది. భారీ అగ్ని కీలలు చెలరేగడంతో పాటు ఉరాన్ ప్రాంతం మొత్తం దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. గ్యాస్ లీకేజీని అదుపు చేసేందుకు వెళ్లిన సిబ్బంది మృత్యువాత పడినట్లు సీఐఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్ స్పెక్టర్ జనరల్(వెస్ట్ జోన్) నీలిమా సింగ్ తెలిపారు. అయితే స్థానికులు భయపడనక్కర్లేదని పోలీసులు చెప్పారు. ఈ ప్రమాద ప్రభావం తమ ఉత్పత్తిసరఫరా కార్యకలాపాలపై పడబోదని ఓఎన్జీసీ రెసిడెంట్ ప్రోడక్షన్ సూపరింటెండెంట్ సీఎన్ రావు తెలిపారు. గ్యాస్ ను సూరత్(గుజరాత్) లోగల తమ హజిరా ప్లాంట్ కు మళ్లిస్తున్నామన్నారు. గ్యాస్ లీకేజీని అదుపు చేస్తున్నట్లు చెప్పారు. 22 అగ్నిమాపక శకటాలు మంటలు ఆర్పే పనుల్లో నిమగ్నమయ్యాయి. ఘటన వార్త తెలియగానే జవహర్ లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్(జె.ఎన్.పి.టి)రిలయన్స్ గ్రూప్తలోజాలోని మహారాష్ర్త ఇండస్రిా్యల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ సిబ్బందినవీ ముంబయి వాసులు హుటాహుటిన అక్కడకు చేరుకుని సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. క్షతగాత్రుల్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 

Monday, September 2, 2019

Man arrested for trying to enter Parliament with knife


కత్తితో పార్లమెంట్ లోకి వెళ్లబోయిన దుండగుడి అరెస్ట్
భారత పార్లమెంట్ లోకి కత్తితో వెళ్లేందుకు యత్నించిన 26 యువకుణ్ని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలోని లక్ష్మీ నగర్ కు చెందిన సాగర్ ఇన్సాగా అతణ్ని గుర్తించారు. అత్యాచార కేసులో అరెస్టయి జైలులో ఉన్న డేరా సచ్ఛా సౌధ అధినేత గుర్మీత్ రామ్ సింగ్ అనుచరుడిగా భావిస్తున్నారు. ఈ ఉదయం సుమారు 11 గంటలకు దుండగుడు గేట్ నంబర్ 1 నుంచి పార్లమెంట్ లోకి ప్రవేశించాలని యత్నించాడు. అక్కడ తనిఖీల్లో అతని వద్ద కత్తిని గుర్తించిన రక్షణ సిబ్బంది వెంటనే నిర్బంధించారు. పోలీసులు దుండగుణ్ని పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ కు తరలించి విచారిస్తున్నారు. ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐ.బి) అధికారులు కూడా అక్కడకు చేరుకుని అతణ్ని ప్రశిస్తున్నారు. న్యూఢిల్లీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఈష్ సింఘాల్ ఈ మేరకు పాత్రికేయులకు వివరాలు వెల్లడించారు. కత్తిని రహస్యంగా దుస్తుల్లో దాచిపెట్టుకుని బైక్ పై దుండగుడు పార్లమెంట్ కు వచ్చినట్లు  తెలిపారు. కత్తితో పాటు బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతణ్ని నిర్బంధించినప్పుడు డేరా సచ్ఛా సౌధకు అనుకూలంగా నినాదాలు చేశాడన్నారు. దుండగుడు ఏ ఉద్దేశంతో పార్లమెంట్ లోకి ప్రవేశించాలనుకున్నాడో విచారణలో తేలనుందని సింఘాల్ చెప్పారు. అతని తల్లిదండ్రులు చిరువ్యాపారులని, సోదరుడి బైక్ ను తీసుకుని వచ్చి ఈ దుస్సాహసానికి ఒడిగట్టాడన్నారు.