శ్రీదేవి జయంతి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న జాహ్నవి
బాలీవుడ్ నటి జాహ్నవి మంగళవారం తిరుమలలో స్వామి వారిని దర్శించుకున్నారు. తన తల్లి శ్రీదేవి 56వ జయంతి సందర్భంగా
ఆమె కాలినడక మార్గంలో శ్రీవారి ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి
వారి ఆలయంలో తల నేలకు తాకించి మోకాలి ఆరాధన
చేశారు. ‘హ్యాపీ బర్త్ డే అమ్మా, ఐ లవ్ యూ’ అంటూ జాహ్నవి ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా ఆమె ఇన్ స్టాగ్రామ్
లో పెట్టిన ఫొటోలు వైరల్ అయ్యాయి. తరచు జాహ్నవి స్వామి ఆలయానికి విచ్చేస్తుంటారు. ఈసారి
తెలుగు సంప్రదాయ దుస్తుల్లో స్నేహితులతో కలిసి స్వామి సన్నిధికి విచ్చేశారు. ఏదైనా
ప్రత్యేక కార్యక్రమం చేపట్టిన ప్రతిసారీ విధిగా ఆమె స్వామి వారి సన్నిధికి వస్తుంటారు.
ఇంతకుముందూ జాహ్నవి తండ్రి బోనీ కపూర్, చెల్లెలు ఖుషీ లతో కలిసి
తిరుపతి ఆలయాన్ని సందర్శించారు. అచ్చ తెలుగు అమ్మాయిలా ఆకుపచ్చ వోణి బంగారు రంగు పరికిణి
ధరించిన ఆమె స్వామి సేవలో పాల్గొన్న ఫొటోలు అభిమానుల్ని అలరిస్తున్నాయి. ఈ ఫొటోలకు
వేల సంఖ్యలో లైక్ లు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా స్టార్ డమ్ సాధించిన శ్రీదేవి 2018
ఫిబ్రవరి 24న దుబాయ్ హోటల్లోని బాత్ రూమ్ టబ్ లో ఆకస్మికంగా మృతి చెందిన సంగతి తెలిసిందే.