ఇండోనేసియా ఓపెన్ ఫైనల్స్ చేరిన స్టార్ షట్లర్ సింధు
భారత స్టార్ షట్లర్ సింధు
ఇండోనేసియా ఓపెన్ ఫైనల్ కు చేరింది. ఫైనల్ లో ఆదివారం ఆమె చిరకాల ప్రత్యర్థి జపాన్
షట్లర్ ఫోర్త్ సీడ్ అకానె యమగూచితో తలపడనుంది.
సింధు ఈ ఏడాది ఫైనల్స్ కు చేరడం ఇదే ప్రథమం. శనివారం జరిగిన సెమీ ఫైనల్స్
లో ఆమె సెకండ్ సీడ్ చైనా షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి చెన్ యు ఫై 21-19 21-10
గేమ్ ల తేడాతో ఓడించింది. సింధు తనదైన శైలిలో శక్తివంతమైన స్మాష్ లు, నెట్ దగ్గర అమోఘమైన
డ్రాప్ షాట్లతో ప్రత్యర్థిపై పైచేయి సాధించింది. సింధు చురుకైన ఆటతీరుకు చెన్ యు వద్ద
సమాధానమే లేకపోయింది. అయితే తొలిగేమ్ మొదట్లో చెన్ దూకుడు కనబరచగా సింధు నెమ్మదిగా
ఆట కొనసాగించింది. చెన్ 18-14 తో ముందంజలో ఉండగా సింధు పుంజుకుని వరుసగా నాల్గు పాయింట్లు
సాధించి 18-18 తో సమఉజ్జీగా నిలిచింది. ఈ గేమ్ ను ప్రత్యర్థి చెన్ గెలుచుకోకుండా చాలా
సేపు సింధు నిలువరించగల్గింది. గేమ్ పాయింట్ వద్ద నుంచి సింధు ఆటపై పట్టుకోల్పోకుండా
కొనసాగించింది. ఆ తర్వాత సింధు ఆటలో వేగం పెంచి ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెట్టింది.
స్మాష్ లు, డ్రాప్ షాట్లతో పాయింట్లను గెలుచుకుంది. తొలి గేమ్ ను 21-19తో సొంతం చేసుకుంది.
నివ్వెరపాటు నుంచి తేరుకున్న చెన్ తొలిగేమ్ లో మాదిరిగానే రెండో గేమ్ లోనూ తనదైన రీతిలో
చెలరేగి వరుసగా 4 పాయింట్లను సాధించి 4-0 తో సింధుపై ఆధిపత్యాన్ని కనబర్చింది. ఆటపై
ఏకాగ్రత కోల్పోకుండా పట్టుదలగా ఆడిన సింధు డిఫెన్సివ్ ప్లేతో చెన్ ఆట లయను దెబ్బతీసింది.
సింధు ఎత్తుగడ ఫలించి చెన్ చాలా అనవసరమైన తప్పిదాలు చేసింది. ప్రత్యర్థికి అవకాశమే లేకుండా ఆటపై పట్టు కనబరస్తూ సింధు 21-10 తేడాతో గేమ్ ను మ్యాచ్ ని గెలుచుకుని ఫైనల్ లో అడుగుపెట్టింది.