Friday, May 24, 2019

India bans Jamaat-ul-Mujahideen Bangladesh terror outfit



జమాత్ ఉల్ ముజాహిద్దీన్ ఉగ్ర సంస్థపై భారత్ నిషేధాస్త్రం
బంగ్లాదేశ్ కేంద్రంగా ఉగ్ర కార్యకలాపాలు నిర్వహించే జమాత్ ఉల్ ముజాహిద్దీన్(జె.ఎం.బి) సంస్థను భారత ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మనదేశంలోని బుర్ద్వాన్, గయాల్లో జరిగిన బాంబు పేలుళ్లలో ఈ ఉగ్ర సంస్థ కు చెందిన ఉగ్రవాదుల పాత్ర ఉందనే అనుమానంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జేఎంబీ తన కార్యకలాపాల్ని భారత ఉపఖండం మొత్తం విస్తరించే ప్రమాదం పొంచి ఉందనే నిఘా వర్గాల సమాచారం మేరకు నిషేధాస్త్రాన్ని ప్రయోగించారు. కేంద్ర హోంశాఖ గురువారం (మే23) జె.ఎం.బి.ని నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. జిహాద్ నినాదంతోపాటు ఇస్లాం రాజ్య స్థాపనే లక్ష్యంగా ఈ సంస్థ 1998 నుంచి పెద్ద ఎత్తున యువకుల్ని ఆకర్షించి గ్రూపులోకి చేర్చుకుని వారికి ఉగ్రవాద కార్యకలాపాల శిక్షణ ఇస్తోంది. భారత్ లో ఈ సంస్థ తమ కార్యకలాపాల్ని విస్తరించే పనిలో నిమగ్నమైనట్లు అనుమానిస్తున్నారు. 2014 అక్టోబర్ లో బుర్ద్వాన్ లో, 2018 జనవరిలో బుద్ధ గయలో పేలుళ్లకు పాల్పడిన వారిలో ఈ జె.ఎం.బి. ఉగ్రవాదులున్నట్లు భావిస్తున్నారు. అసోం పోలీసులు అయిదు కేసుల్లో జె.ఎం.బి. పాత్రను నిర్ధారించారు. ఈ గ్రూపునకు చెందిన 56 మందిని అరెస్ట్ చేశారు. పోలీసు విచారణలో పశ్చిమబెంగాల్, అసోం, త్రిపుర, బంగ్లా-భారత్ సరిహద్దుల్లోని 10 కి.మీ. పరిధిలో ఉగ్ర కార్యకలాపాలకు జె.ఎం.బి. రచించిన ప్రణాళికలు వెల్లడికావడంతో కేంద్ర హోంశాఖ అప్రమత్తమైంది.  

PM Narendra Modi, Amit Shah meet Advani, Murli Manohar Joshi



అద్వానీ జోషీలను కలిసిన ప్రధాని మోదీ
తాజా లోక్ సభ ఎన్నికల్లో మరోసారి అనూహ్య విజయాన్ని అందుకున్న ప్రధానమంత్రి మోదీ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక, కురువృద్ధులైన నాయకులు ఎల్.కె.అద్వానీ, మురళీ మనోహర్ జోషి లను కలుసుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడగా ఒక రోజు వ్యవధిలోనే బీజీపీ అధ్యక్షుడు అమిత్ షా వెంట రాగా మోదీ శుక్రవారం(మే24) తన గురువు అద్వానీ, జోషిలను వారి నివాసాలకు వెళ్లి కలుసుకుని విజయానందాన్ని పంచుకున్నారు. ఈ రోజు బీజేపీ విజయం సాధించిందంటే అద్వానీజీ దశాబ్దాలుగా పార్టీ నిర్మాణానికి వేసిన పునాదులు, సాగించిన కృషి ఫలితమేనని, తాజా ఆలోచనా విధానాన్ని ఆయన ప్రజల వద్దకు చేర్చారంటూ ట్వటర్ లో మోదీ పేర్కొన్నారు. జోషి గురించి ట్వీట్ చేస్తూ మోదీ..ఆయన గొప్ప విద్యావంతుడు, మేధావి.. భారతీయ విద్యా విధానంలో గణనీయమైన మార్పులు తీసుకువచ్చారు. అహరహం బీజేపీ పటిష్టతకు కృషి చేశారు..తనతోపాటు పలువురు కార్యకర్తల్ని ఆయన తీర్చిదిద్దారని ప్రశంసించారు.

Thursday, May 23, 2019

Naveen Patnaik's BJD set to form government in Odisha

నవీన్ పట్నాయక్ అయిదోసారి సీఎంగా జయకేతనం


ఒడిశాలో మళ్లీ బిజూ జనతాదళ్(బీజేడీ) అధికారాన్ని చేజిక్కించుకుంది. అయిదోసారి నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి కానున్నారు. రాష్ట్రంలోని 147 అసెంబ్లీ, 21 లోక్ సభ నియోజకవర్గాలకు ఏప్రిల్ 29న జరిగిన ఎన్నికల్లో నవీన్ సారథ్యంలో బీజేడీ స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. 2000 వ సంవత్సరం నుంచి సీఎంగా ఎన్నికవుతున్న నవీన్ 2019లో మరోసారి ఆ పదవిని అధిష్టించనున్నారు. నవీన్ పట్నాయక్ తల్లిదండ్రులు జ్ఞాన్ పట్నాయక్(పంజాబీ), బిజూ పట్నాయక్(మాజీ ముఖ్యమంత్రి)లకు 1946, అక్టోబర్16న కటక్ లో జన్మించారు. తండ్రి బిజూ పట్నాయక్ ఒడిశా ముఖ్యమంత్రిగా 1961-63లో తొలిసారి పనిచేశారు. తర్వాత 1990-95 వరకు రెండోసారి సీఎంగా రాష్ట్రాన్ని పరిపాలించారు. 1997లో బిజూ పట్నాయక్  మరణానంతరం ఆయన ద్వితీయ కుమారుడు నవీన్ పట్నాయక్ 11వ లోక్ సభకు అస్కా నియోజకవర్గం నుంచి తొలిసారి ఎన్నికయ్యారు.  

Wednesday, May 22, 2019

lok sabha polls 2019: highest ever voter turnout: election commission



లోక్ సభ ఎన్నికల్లో పెరుగుతూ వస్తోన్న ఓట్ల శాతం
గడిచిన ఒకటిన్నర దశాబ్దంగా జరుగుతున్న లోక్ సభ సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో ఓట్ల శాతం క్రమక్రమంగా పెరుగుతోంది. ఇటీవల 17వ లోక్ సభ ఎన్నికల క్రతువు ఆరు వారాలు నిర్విఘ్నంగా కొనసాగి ఆఖరి ఘట్టానికి చేరుకుంది. ఏప్రిల్ 11న మొదలైన ఎన్నికల పోలింగ్ 7 దశల్లో మే 19న ముగిసిన సంగతి తెలిసిందే. ఈ 2019 సార్వత్రిక ఎన్నికల్లో 543 నియోజకవర్గాలకు గాను 542 స్థానాలకు(545 మంది మొత్తం సభ్యుల్లో 2 ఆంగ్లో ఇండియన్లను రాష్ట్రపతి నియమిస్తారు) పోలింగ్ నిర్వహించారు. విచ్చలవిడిగా డబ్బుల కట్టలను కనుగొన్న తమిళనాడులోని వెల్లూరు నియోజకవర్గంలో  ఈసీ ఎన్నికను వాయిదా వేసింది. దేశ వ్యాప్తంగా మొత్తం 7దశల్లో సాగిన పోలింగ్ లో మొత్తం ఓటింగ్ 67.11 శాతంగా కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీఐ) పేర్కొంది. తొలిదశలో అత్యధికంగా 69.61 శాతం నమోదయింది. అన్ని రాష్ట్రాల్లో కన్నా హిమాచల్ ప్రదేశ్ లో ఈసారి అత్యధికంగా 72.25 శాతం ఓటింగ్ నమోదై రికార్డు నెలకొల్పింది. 2014 ఎన్నికల్లో 66.40 శాతం కన్నా ఈసారి కొంత మెరుగ్గా ఓటింగ్ జరిగింది. 2009 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ లో మొత్తం 58.19 శాతమే ఓటింగ్ నమోదయింది. 2004లో 56 శాతం ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు.