రంగంలోకి దిగిన సీఎం చంద్రబాబు ఢిల్లీలో నేతలతో భేటీ
ఆంధ్రప్రదేశ్
ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం(మే17) ఢిల్లీ చేరుకున్నారు. సార్వత్రిక ఎన్నికల ఆఖరి
దశ పోలింగ్ 19న జరగనుండగా ఫలితాలు 23న వెలువడనున్న సంగతి తెలిసిందే. మే23న
మిత్రపక్షాలు, కాంగ్రెస్ తో కలిసి వచ్చే
అవకాశం ఉన్న పార్టీలతో యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ సమావేశం కానున్నారు. అంతకు
వారం ముందుగానే చంద్రబాబు ప్రభుత్వ ఏర్పాటులో మరోసారి కీలకపాత్ర పోషించడానికి
ఉద్యుక్తులయ్యారు. శుక్రవారం ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, సీపీఐ(ఎం) ప్రధాన
కార్యదర్శి సీతారాం ఏచూరిని కలుసుకుని చర్చలు జరిపారు. శనివారం ఆయన కాంగ్రెస్
అధ్యక్షుడు రాహుల్ గాంధీని కలవనున్నారు. తర్వాత లక్నో వెళ్లి బీఎస్పీ అధినేత్రి
మాయవతి, సమాజ్ వాది పార్టీ అధినాయకుడు అఖిలేశ్ యాదవ్ లను చంద్రబాబు కలవనున్నట్లు
తెలుస్తోంది. ఈ సందర్భంగా విలేకర్లు అడిగిన
ప్రశ్నకు చంద్రబాబు సమాధానం చెబుతూ టీఆర్ఎస్ సహా భారతీయ జనతాపార్టీని వ్యతిరేకించే
అన్ని పక్షాలను తమ కూటమిలోకి స్వాగతిస్తామన్నారు. ఢిల్లీ చేరగానే తొలుత ఆయన
ఎన్నికల సంఘాన్ని కలిసి ఈవీఎంలతో పాటుగా 50 శాతం వీవీప్యాట్ ల్ని లెక్కించాలన్న ప్రతిపక్షాలు
డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రాష్ట్రాల్లో ఎన్నికల సంఘాల తీరు ఏకపక్షంగా, పక్షపాత
ధోరణితో కొనసాగిన విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తెచ్చారు. రీపోలింగ్
తదితర చాలా అంశాల్లో స్థానిక అధికారుల తీరు వివాదాస్పదమయిందన్నారు. ముఖ్యంగా ఏపీలోని
చంద్రగిరి నియోజకవర్గంలో 38 రోజుల తర్వాత 5 కేంద్రాల్లో రీపోలింగ్
చేపట్టనుండడాన్ని తప్పుబడుతూ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. వై.ఎస్.ఆర్.సి.పి.
సిట్టింగ్ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కరరెడ్డి కోరగా రాష్ట్ర ఎన్నికల సంఘం సిఫార్సు
మేరకు కేంద్ర ఎన్నికల సంఘం రీపోలింగ్ నిర్ణయాన్ని ఇటీవల వెల్లడించింది. తొలివిడత
ఏప్రిల్11నే ఇక్కడ ఎన్నిక పూర్తవ్వగా ఎన్నికల మలిదశ మే19న రీపోలింగ్ తలపెట్టడాన్ని
అధికార తెలుగుదేశం పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.