రూపాయి నాణేలతో బైక్ కొన్న యువకుడు
తమిళనాడు సేలం జిల్లా అమ్మపేటకు చెందిన ఓ యువకుడు చిల్లర నాణేలతో బైక్ కొని వార్తల్లోకెక్కాడు. భూపతి అనే చిరుద్యోగి రూ.2.60 లక్షలతో బజాజ్ డొమినర్-400 బైక్ కొన్నాడు. బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసిన ఈ 29 ఏళ్ల యువకుడు చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. ఎప్పటి నుంచో అతనికి బైక్ కొనాలనే ఆశ. మూడేళ్లు క్రితం అతను బజాజ్ షోరూంకు వెళ్లి బైక్ రేటు గురించి కనుక్కున్నాడు. అప్పటి నుంచి రూపాయి నాణేలను కూడబెట్టాడు. ఆ నాణేలన్నింటిని బస్తాల్లో కట్టి బజాజ్ షోరూంకు ట్రాలీలో తీసుకొచ్చాడు. తొలుత అంగీకరించని షోరూం సిబ్బంది భూపతి బ్రతిమలాడ్డంతో తర్వాత ఒప్పుకున్నారు. నాణేలు లెక్కించడానికి అతని స్నేహితులతో పాటు సిబ్బంది 10 గంటల పాటు శ్రమించారు. లెక్క సరిపోయాక బిల్లు, ఇతర ఫార్మాలిటీస్ పూర్తి చేసిన సిబ్బంది అతనికి బైక్ ఇచ్చి పంపించారు. దాంతో హైఎండ్ బజాజ్ బైక్ పై భూపతి కేరింతలు కొడుతూ ఇంటికి చేరాడు. ఈ మొత్తం తతంగాన్ని వీడియో తీసిన అతను స్నేహితులకు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేయడంతో వైరల్ అయింది.