Monday, February 28, 2022

AP CM YSJagan launches third instalment jagananna thodu scheme

చిరు వ్యాపారుల ఖాతాల్లో రూ.526 కోట్లు 

జగనన్న తోడు పథకం కింద సుమారు 5లక్షల 10వేల మంది చిరువ్యాపారులకి మేలు చేకూరుస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి సుమారు రూ.526కోట్ల మొత్తాన్నినేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తూ వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కారు. ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయం అందనుంది. విడతల వారీగా లబ్ధిదారులు తమ రుణ మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించాల్సి ఉంటుంది. కాలవ్యవధి ప్రకారం రుణం చెల్లించిన అందరికీ వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించనుంది. వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా చిరువ్యాపారులకు తోడుగా ఉండడమే తమ లక్ష్యమని జగన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. అయితే క్రమం తప్పకుండా రుణ వాయిదాలను బ్యాంకులకు చెల్లించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఇంతవరకు జగనన్న తోడు కింద మూడో విడతతో కలిపి మొత్తం 14 లక్షల 16 వేల 14 మంది సాయం అందించినట్లయిందన్నారు. సోమవారం తాజాగా విడుదల చేసిన రూ.10 వేల వడ్డీ లేని రుణ సాయం అందని వారేవరైనా ఉంటే ఆందోళన చెందొద్దని సీఎం కోరారు. రుణ సాయం అందని వారు గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లను కలుసుకొని అవసరమైతే మళ్లీ జగనన్న తోడు పథకానికి దరఖాస్తు చేయాలన్నారు.

Thursday, February 24, 2022

Russia Attacks Ukraine, Air Raid Sirens Reported In Capital Kyiv

వార్ వన్ సైడ్

రష్యా అన్నంత పని చేసింది. ఉక్రెయిన్ తమ దేశంలో భాగమేనని మొదటి నుంచి చెబుతున్న రష్యా గురువారం తెల్లవారుజామున (భారత కాలమానం ప్రకారం) యుద్ధం ప్రకటించింది. గంటల వ్యవధిలోనే ఉక్రెయిన్ కీలక నగరాల్ని స్వాధీనంలోకి తెచ్చుకుంది. దేశంలో ఇప్పటికే ఎమర్జెన్సీ ప్రకటించిన ఉక్రెయిన్ ప్రతిఘటించి తీరతామని రష్యాకు సవాలు విసిరింది. రష్యా ఏకపక్ష దాడి, దురాక్రమణను ఐక్యరాజ్యసమితి అడ్డుకోవాలని అధ్యక్షుడు జెలెన్ స్కీ కోరారు. బదులు చెప్పి తీరతామని రష్యాను అమెరికా మరోసారి హెచ్చరించింది. అధ్యక్షుడు జోబైడన్ ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. మరో వైపు ఐక్యరాజ్యసమితి అత్యవసర భేటీ నిర్వహిస్తోంది. రష్యా సైనిక చర్యను నిలిపివేయాలని కోరింది. ఇప్పటికే రాజధాని కీవ్ ఎయిర్ పోర్ట్ ను రష్యా ఆక్రమించింది. ఉక్రెయిన్ లోని 23 అతికీలక ప్రాంతాల్లో రష్యా సైన్యం బాలిస్టిక్ మిస్సైల్స్ తో దాడి జరిపింది. త్రిముఖవ్యూహంతో ఉక్రెయిన్ భూభాగాన్ని చుట్టిముట్టిన రష్యా క్రమక్రమంగా ఆ దేశంలోకి చొచ్చుకుంటూ ముందుకు సాగుతోంది. దాంతో ఉక్రెయిన్ హైవేలపై జనం పెద్ద సంఖ్యలో కార్లలో తరలిపోవడం కనిపిస్తోంది. ఇప్పటికే 11 నగరాల్లో రష్యా బలగాలు పాగా వేసినట్లు సమాచారం. బోరిస్పిల్, డాన్ బాస్, ఖార్కిన్, ఒడెస్సా, మరియుపోల్ తదితర ప్రాంతాల్లో రష్యా బాంబుల మోత మోగుతోంది. వాయు,జల, భూమార్గాల్లో రష్యా ముప్పేట దాడి చేస్తూ ఉక్రెయిన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బెలారెస్, క్రిమియాలు రష్యాకు మద్దతుగా యుద్ధభేరి మోగిస్తున్నాయి. ఇంకో పక్క నాటో కూటమి ఉక్రెయిన్ కు బాసటగా యుద్ధానికి దిగనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలందుతున్నాయి.

Thursday, February 17, 2022

Hyderabad police arrest Telangana Congress chief A Revanth Reddy over remarks against CM

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అరెస్ట్

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గురువారం తెల్లవారుజామున అరెస్ట్ అయ్యారు. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు జన్మదినోత్సవ సంబరాల్లో ఆ పార్టీ శ్రేణులు మునిగితేలుతుండగా రేవంత్ అరెస్ట్ పట్ల కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలతో హోరెత్తిస్తున్నారు. అస్సాం సీఎం హిమంత్ బిస్వా శర్మ..రాహుల్‌గాంధీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై టీ కాంగ్రెస్‌ శ్రేణులు మండిపడుతున్నాయి. అస్సాం సీఎంపై పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ మేరకు బుధవారం జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అస్సాం సీఎంపై కేసు నమోదు చేయకుండా కేసీఆర్‌ తాత్సారం చేస్తున్నారని విమర్శలు గుప్పించారు. నేడు నిరసన కార్యక్రమాలు జోరు పెంచాలని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దాంతో ఈ రోజు ఉదయం రేవంత్‌ రెడ్డిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్టర్‌ వేదికగా కేసీఆర్‌పై అగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జన్మదినం.. ప్రతిపక్షాలకు జైలు దినం కావాలా అని ఆయన మండిపడ్డారు. నిరుద్యోగుల ఆవేదనకు సమాధానం చెప్పకుండా ఉత్సవాలు ఏమిటని ప్రశ్నించడమే మేం చేసిన పాపమా అని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. కేసీఆర్ జన్మదినం.. నిరుద్యోగుల ఖర్మ దినంగా మారిందన్నారు.

Tuesday, January 18, 2022

Dhanush-Aishwarya`s marital life come to end

విడిపోయిన మరో స్టార్ జోడి

మరో సెలబ్రిటీ జంట తమ వివాహ బంధానికి బ్రేక్ అప్ చెప్పేశారు. ఇటీవల తెలుగునాట ప్రముఖ తారలు నాగచైతన్య, సమంతాల జోడి విడిపోగా ఇప్పుడు అదే బాటలో తమిళనాడుకు చెందిన సెలబ్రిటీలు స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్యాలు విడిపోతున్నట్లు ప్రకటించారు. ఐశ్వర్య దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ కుమార్తె. ఆమె తమిళ సినీ నిర్మాతగా పేరొందగా ధనుష్ సూపర్ స్టార్ గా ఎదిగారు. ధనుష్ కంటే ఐశ్వర్య రెండేళ్లు పెద్ద. వీరిద్దరూ ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. తాజాగా తమ 18 ఏళ్ల వివాహ బంధానికి తెరవేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఫ్రెండ్స్ గా కొనసాగుతామని వేర్వేరు ట్వీట్లలో పేర్కొన్నారు.