ఎట్టకేలకు శిల్పాచౌదరి విడుదల
కిట్టీ పార్టీల పేరుతో కోట్లకు టోకరా వేసి అరెస్టయిన శిల్పాచౌదరి శుక్రవారం ఎట్టకేలకు జైలు నుంచి విడుదల అయింది. ఆమెపై నమోదైన మూడు కేసుల్లో రాజేంద్రనగర్ కోర్టు గురువారం బెయిల్ మంజూరు చేయగా ఈ ఉదయం చంచల్గూడ జైలు నుంచి బయటకు వచ్చారు. అధిక వడ్డీలు, రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో బడావ్యక్తుల్ని కోట్ల రూపాయలకు ముంచేసిన కేసులో శిల్పా నిందితురాలు. బెయిల్ మంజూరు సందర్భంగా న్యాయస్థానం శిల్పాచౌదరికి కొన్ని షరతులు విధించింది. రూ.10వేల ష్యూరిటీ సమర్పించడంతో విదేశీ ప్రయాణాలు చేయొద్దని ఆదేశించింది. ఎవరితోనూ ఫోన్లో కానీ, నేరుగా కానీ ఈ కేసు విషయం మాట్లాడకూడదని, సాక్షులను బెదిరించరాదని కోర్టు గట్టిగా చెప్పింది. అలాగే ప్రతి శనివారం నార్సింగి పోలీస్స్టేషన్లో హాజరుకావాలని ఆదేశించింది. నవంబర్ 13న దివ్యారెడ్డి అనే మహిళ నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు 25న శిల్పాచౌదరి, ఆమె భర్తను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కోర్టు అనుమతితో మూడుసార్లు పోలీస్ కస్టడీకి తీసుకుని విచారించినా ఆమె నోరు విప్పలేదు. కొందరు మహిళలకు డబ్బు ఇచ్చానని, ఓ ఆసుపత్రి నిర్మాణంలో పెట్టుబడి పెట్టానని, హయత్నగర్లో ఓ ప్లాటు, గండిపేటలో ఓ విల్లా ఉందని మాత్రం చెప్పుకొచ్చింది. వాటిని అమ్మి తనపై ఫిర్యాదులు చేసిన వారికి డబ్బు తిరిగి ఇచ్చేస్తానని విచారణ సందర్భంగా శిల్పా తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఆమె భర్తకు ఉప్పర్పల్లి కోర్టు గతంలోనూ బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. శిల్పాచౌదరి బెయిల్ పిటిషన్లను మూడుసార్లు కోర్టు తిరస్కరించడం గమనార్హం.