విజయవాడలో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ శ్రీ లలితాత్రిపురసుందరిదేవిగా భక్తుల్ని అనుగ్రహిస్తోంది. ఆరో రోజు గురువారం తెల్లవారుజాము 5 నుంచే పెద్ద సంఖ్యలో భక్తులకు అమ్మలగన్నమ్మ దర్శనం లభిస్తోంది. శ్రీచక్ర అధిష్ఠానశక్తిగా, పంచదాశాక్షరీ మహామంత్రాధిదేవతగా వేంచేసిన అమ్మవారిని తిలకించి భక్తులు, ఉపాసకులు తరిస్తున్నారు. బుధవారం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టువస్త్రాలు, పసుపు కుంకుమ సమర్పించారు. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మూలా నక్షత్రం రోజున కనకదుర్గమ్మను సీఎం సంప్రదాయ దుస్తుల్లో విచ్చేసి దర్శించుకున్నారు. ఆయనకు అమ్మవారి ఫొటోను దేవస్థానం ట్రస్ట్ బహుకరించింది. అదేవిధంగా సీఎం అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా దుర్గగుడి 2021 క్యాలెండర్ను జగన్ ఆవిష్కరించారు.
Thursday, October 22, 2020
Vijayawada 6th day of Navratri festival goddess Durga worshiped as Lalitha Tripura Sundari Devi
Tuesday, October 20, 2020
Officials on alert as IMD extends heavy rain warning for next 72 hours in Telugu states
జడి వానకు.. వెన్నులో వణుకు
ఉభయ తెలుగు రాష్ట్రాలు ఎడతెగని వానలతో భీతిల్లుతున్నాయి. ఇటీవల కుంభవృష్టికి ఊళ్లకు ఊళ్లు చివురుటాకుల్లా వణికిపోయాయి. మరోవిడత ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాల్లో జడివాన విరుచుకుపడనుంది. రాగల మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. మధ్య బంగాళాఖాతంలో మంగళవారం ఏర్పడిన అల్పపీడనం మరింత తీవ్రంగా మారనున్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ కారణంగా ఏపీలో ముఖ్యంగా తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో రాబోయే 72 గంటల్లో అతి భారీ వర్షాలు కురవొచ్చని వాతావరణ కేంద్రం (ఐఎండీ) అంచనా. అదే విధంగా కర్నూలు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు; అనంతపురం, చిత్తూరు జిల్లాలలో భారీ వర్షాలు కురవొచ్చని పేర్కొంది.
Friday, October 16, 2020
Punjab: Shaurya Chakra Awardee Balwinder Singh Shot Dead In Tarn Taran
ఉగ్ర తూటాలకు నేలకొరిగిన `శౌర్య చక్ర`
ఉగ్రవాదులకు ఆయన సింహస్వప్నం.. ముష్కరుల ఏరివేతలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన యోధుడు. ఆయనే బల్వీందర్ సింగ్. నిరుపమాన సేవలకు గాను 1993లో భారత ప్రభుత్వం ఆయనను శౌర్య చక్ర పురస్కారంతో సత్కరించింది. బల్వీందర్ సింగ్ పై లెక్కలేనన్ని సార్లు ఉగ్రవాదులు హత్యాయత్నాలకు పాల్పడ్డారంటేనే ఆయన వారిపై ఏ స్థాయిలో ఉక్కుపాదం మోపారో తేటతెల్లమౌతుంది. అయితే ఏడాది కిందట ఎందుకనో ప్రభుత్వం ఆయనకు సెక్యూరిటీని తగ్గించింది. దాంతో శుక్రవారం బల్వీందర్ సింగ్ ఇంటిపై దాడి చేసిన దుండగులు ఆయనను అతి సమీపం నుంచి కాల్చి చంపారు. పంజాబ్లోని తరణ్ తరణ్ జిల్లాలోని భిఖివింద్ గ్రామంలోని తన నివాసం పక్కనే ఉన్న కార్యాలయంలో బల్వీందర్ సింగ్ ఉండగా మోటార్ బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపి పారిపోయారని పోలీసులు తెలిపారు. 62 ఏళ్ల ముదిమిలో ఉగ్రవాదులు ఆయనను పొట్టనబెట్టుకున్నారు. ఉగ్రవాదులకు వ్యతిరేకంగా అలుపెరుగని పోరాటం చేసిన బల్వీందర్ సింగ్కు పంజాబ్లో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన దారుణంగా హత్యకు గురవ్వడం రాష్ట్ర వాసుల్ని దిగ్భ్రాంతికి గురి చేస్తోంది.
Wednesday, October 14, 2020
Legendary Kuchipudi Dancer Shobha Naidu Passed away
నాట్య మయూరి శోభానాయుడు ఇకలేరు
ప్రముఖ కూచిపూడి నాట్య కళాకారిణి శోభా నాయుడు (64) కన్నుమూశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బుధవారం తెల్లవారుజామున ఆమె తుది శ్వాస విడిచారు. సెప్టెంబర్ నుంచి శోభా నాయుడు చికిత్స పొందుతూ ఉన్నారు. ఇంట్లో జారిపడడంతో తలకు తీవ్ర గాయమైంది. అప్పట్నుంచి ఆమె ఆరోగ్యం అంతంతమాత్రంగానే ఉంది. ఆర్థో న్యూరాలజీ సమస్యలతో బాధపడుతున్నారు. అదే క్రమంలో శోభానాయుడుకు కరోనా కూడా సోకింది. దాంతో ఆరోగ్యం మరింత క్షీణించింది. కరోనా పాజిటివ్ అని తేలిన దగ్గర నుంచి ఆమె ఆస్పత్రికే పరిమితమయ్యారు. 1956లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లిలో జన్మించిన శోభానాయుడు కూచిపూడి నృత్యంతో జగద్విఖ్యాతి సాధించారు. క్వీన్స్ మేరీ కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. 12 ఏళ్లకే కూచిపూడిలో ఆరంగేట్రం చేశారు. వెంపటి చినసత్యం వద్ద శిష్యురాలిగా చేరారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు ఆమె ఎన్నో వేల ప్రదర్శనలు ఇచ్చారు. వెంపటి నృత్య రూపాలలోని పలు పాత్రలను పోషించారు. సత్యభామ, పద్మావతి, చండాలిక పాత్రల్లో రాణించి మెప్పించిన శోభా నాయుడును కేంద్రం 2001లో పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. 40 ఏళ్లగా కూచిపూడి శిక్షణ తరగతులు నిర్వహిస్తున్న శోభా నాయుడుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది శిష్యులున్నారు.