ముక్కు కారుతోందా..? అయితే కరోనా లేనట్లే..!
కరోనా భయంతో అనవసర పరీక్షలు చేయిస్తున్న పిల్లల తల్లిదండ్రులకు బ్రిటన్ వైద్య నిపుణులు ఊరట కల్గించే సంగతి చెప్పారు. ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని అభయం ఇచ్చారు. పిల్లలకు సాధారణంగా ముక్కు కారుతూ ఉంటుంది. సీజనల్ గా వచ్చే జలుబు సాధారణ లక్షణమది. ఆ లక్షణం కల్గి ఉన్న పిల్లలపై చేసిన పరీక్షల్లో కరోనా వైరస్ జాడ కనిపించలేదు. దాంతో ముక్కు కారుతూ ఉంటే కరోనా లేనట్లేనని వైద్య నిపుణులు ఘంటాపథంగా చెబుతున్నారు. కరోనా సోకిన వారి ముక్కు దిబ్బడ వేసినట్లు ఉంటుందన్నారు. బ్రిటన్ లో ఇప్పుడిప్పుడే పిల్లలు స్కూళ్లకు వెళ్తున్నారు. అయితే పలువురు పిల్లలు జలుబుతో బాధపడుతున్నారు. వారిలో చాలామంది పిల్లలకు ముక్కు కారుతూండడంతో వారి తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురై అనవసరంగా టెస్టుల కోసం ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ ప్రభుత్వం తరఫున వైద్య రంగ నిపుణులు రంగంలోకి దిగి ఈ ఊరట నిచ్చే అంశాన్ని వెల్లడించారు. లండన్ లోని కింగ్స్ కాలేజీ ప్రొఫెసర్ టిమ్ స్పెక్టర్ ముక్కు కారుతుండడం సాధారణ జలుబుకు సంబంధించిన ఒక కచ్చితమైన సంకేతం అని తేల్చి చెప్పారు. ఇందుకు పలు శాంపిళ్లు, సర్వేలను పరిగణనలోకి తీసుకున్నారు. దేశంలో జలుబుతో బాధపడుతున్న పిల్లల కోసం వారి తల్లిదండ్రులు క్రీకింగ్ టెస్ట్ లకు పరిగెడుతుండడంతో గందరగోళం నెలకొంటోందని వైద్య నిపుణుడు మాట్ హాన్కాక్ పేర్కొన్నారు. కరోనా వైరస్ సింప్టమ్ స్టడీ యాప్ను నడుపుతున్న ప్రొఫెసర్ స్పెక్టర్ తన పరిశోధనలో కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారిలో లక్షణాలు ఈ విధంగా ఉన్నాయని తెలిపారు. అలసట (55 శాతం), తలనొప్పి (55 శాతం), జ్వరం (49 శాతం) తదితర లక్షణాలు పిల్లల్లో కనిపించినట్లు వివరించారు. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిన పెద్దల్లో లక్షణాలు ఇలా ఉన్నాయి. అలసట (87 శాతం), తలనొప్పి (72 శాతం), వాసన కోల్పోవడం (60 శాతం) లక్షణాలు కల్గి ఉన్నట్లు సర్వే వివరాలు వెల్లడించారు. పిల్లలు లేదా పెద్దల్లో జలుబు చేసినప్పుడు ముక్కు కారడం తరచుగా గమనించే విషయమేనని అందుకు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.