ప్రతి రాష్ట్రంలో శ్రీవారి కోవెల
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు దేశ, విదేశాల్లో కొలువుదీరి భక్తుల్ని అలరించనున్నాడు. దేశంలో ముఖ్యంగా ఉత్తరాదిన వివిధ ప్రాంతాల్లో శ్రీవారి ఆలయాల్ని నెలకొల్పే దిశగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. అయోధ్యలో రామమందిరంతో పాటు కలియుగ ప్రత్యక్షదైవం శ్రీనివాసుడి కోవెలను నిర్మించనున్నారు. అయోధ్యలో శ్రీవారి ఆలయాన్ని నిర్మించేందుకు ఐదు ఎకరాల స్థలం కేటాయించాలని యూపీ ప్రభుత్వాన్ని టీటీడీ కోరింది. ఈ ప్రతిపాదన పట్ల యూపీ ప్రభుత్వం సానుకూలత కనబర్చినట్లు సమాచారం. ఇప్పటికే దేశవ్యాప్తంగా 49 టీటీడీ అనుబంధ ఆలయాలు ఉన్నాయి. ప్రస్తుతం కాశీ, జమ్మూలో శ్రీవారి ఆలయ నిర్మాణాలకు అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇందుకు స్థలాల్ని కేటాయించాయి. స్వామి వారి వైభవం, హైందవ సనాతన ధర్మాల్ని ప్రపంచం నలుమూలలకు విస్తరింజేయాలని టీటీడీ సంకల్పించింది. మనదేశంలోని ప్రతి రాష్ట్రంలోనూ శ్రీవారి ఆలయాన్ని నిర్మించదలిచింది. డుమ్మీ, మజిన్ పరిసరాల్లో జమ్మూ ప్రభుత్వం స్థలాన్ని కూడా కేటాయించింది. టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి, ఈఓ అనిల్ సింఘాల్, ఇంజినీరింగ్ అధికారుల బృందం ఆ స్థలాన్ని పరిశీలించడం కూడా పూర్తయింది. దాంతో త్వరలోనే జమ్మూలో శ్రీవారి ఆలయం కొలువుదీరబోతోంది. అదే విధంగా ముంబ బాంద్రా ప్రాంతంలో రూ.30కోట్లతో టీటీడీ ఆలయ నిర్మాణాన్ని చేపట్టనుంది. ఆలయ నిర్మాణానికి 650 గజాల స్థలాన్ని మహారాష్ట్ర సర్కారు కేటాయించింది. అదే క్రమంలో భువనేశ్వర్, వైజాగ్, చెన్నైలలో ఆలయ నిర్మాణ పనులు జరుగుతున్నాయి.