Tuesday, August 25, 2020

Japan: Tokyo installs transparent public toilets in parks that turn opaque when in use

 జపాన్ పార్కుల్లో ఊసరవెల్లి టాయిలెట్లు

నూతన ఆవిష్కరణల్లో అభివృద్ధి చెందిన దేశాలకు ఏమాత్రం తీసిపోమని మరోసారి జపాన్ నిరూపించుకుంది. పార్కుల్లోని మరుగుదొడ్ల నిర్మాణంలో కొంగొత్త పోకడను ఆ దేశం ప్రదర్శించింది. సాధారణంగా పబ్లిక్ టాయిలెట్ అనగానే అపరిశుభ్రత గుర్తొస్తుంది. లోపల శుభ్రంగా ఉందో లేదో అని శంక అందరిలోనూ కల్గకమానదు. అందుకు చెక్ చెబుతూ అద్దాలతో ఈ మరుగుదొడ్లను తీర్చిదిద్దారు. హా! ఇదేమి చోద్యం.. మరుగు లేకుండా ఎలా..ఇలా నిర్మించారనే గా మీమాంస. ఆ భయం మనకు అవసరం లేదండి. ఎవరైనా ఈ టాయిలెట్ లోపలకి వెళ్లి లాక్ చేయగానే ఈ అద్దాల గది రంగు మారిపోతుంది. దాంతో లోపల ఉన్న వాళ్లు బయటకు కనిపించే చాన్సే లేదు. మా దేశంలో టాయిలెట్లు శుభ్రంగా ఉన్నాయని ప్రజలకు చూపించేందుకే ఇలా గ్లాస్ టాయిలెట్లను జపాన్ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే ఈ అద్దాల మరుగుదొడ్లను ఎబిసు పార్క్, యోయోగి ఫుకామాచి మినీ పార్క్, హారు-నో-ఒగావా కమ్యూనిటీ పార్క్, ఎబిసు ఈస్ట్ పార్క్ ల్లో సహా ఎబిసు స్టేషన్లలోనూ చూడవచ్చు. జపాన్ ఆర్కిటెక్ట్ షింగెరు బాన్ ఈ సరికొత్త గ్లాస్ టాయిలెట్లను రూపొందించారు.

Saturday, August 22, 2020

Pawan Kalyan Emotional Message to His Brother Chiranjeevi On His Birthday


చిరంజీవి తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం: పవర్ స్టార్

మెగా కాంపౌండ్ లో అన్నకు తగ్గ తమ్ముడిగా రాణించిన హీరో పవన్ కల్యాణ్ తన మనసులో మాటను మరోసారి కుండబద్దలు కొట్టారు. అన్నయ్య చిరంజీవే తనకు స్ఫూర్తి ప్రదాత అని పునరుద్ఘాటించారు. చిరంజీవి బర్త్ డే సందర్భంగా అపురూపమైన రీతిలో పవర్ స్టార్ స్పందించడం మెగా అభిమానులందర్ని ఓలలాడించిందనే చెప్పాలి. నటుడిగానే కాక జనసేన అధినేతగానూ నిత్యం వార్తలో ఉండే పవన్ కళ్యాణ్ తన అన్నయ్యపై తనకుగల ఆరాధ్య భావనను మరోసారి అఖిలాంధ్ర అభిమానులతో లేఖారూపంగా పంచుకున్నారు. శ్రమైక జీవనమే చిరంజీవి విజయానికి సోపానమని పవన్‌ పేర్కొన్నారు. సామాన్య కుటుంబంలో పుట్టి అసాధారణ వ్యక్తిగా అవతరించారని ప్రశంసించారు. అన్నయ్యే నా తొలి గురువు అని పవన్ ఈ భావోద్వేగ సందేశంలో ప్రకటించారు. `అన్నయ్య చిరంజీవి నా స్ఫూర్తి ప్రదాత. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను ఎంత ఆరాధిస్తానో అన్నయ్య చిరంజీవిని అంతే పూజ్యభావంతో ప్రేమిస్తాను. నా అన్నయ్య, వదిన నాకు తల్లిదండ్రులతో సమానం. అన్నయ్య చెయ్యి పట్టుకునే పెరిగాను. అన్నయ్య నన్ను అమ్మలా లాలించారు. నాన్నలా మార్గదర్శిగా నడిపించారు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న పెద్దల మాటలు అన్నయ్యను చూస్తే నిజమనిపిస్తాయి. అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానులు, శ్రేయోభిలాషుల గుండెల్లో చిరస్మరణీయమైన స్థానాన్ని సంపాదించారు. తెలుగు వారు సగర్వంగా `చిరంజీవి మావాడు` అని చెప్పుకొనేలా తనను తాను మలచుకున్నారు. ఆయన తమ్ముడిగా పుట్టడం నా అదృష్టం` అని పవర్ స్టార్ స్పష్టం చేశారు. `ఆయనకు చిరాయువుతో కూడిన శుఖశాంతులు ప్రసాదించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. అన్నయ్యకు ప్రేమపూర్వక జన్మదిన శుభాకాంక్షలు` అని పవన్ పేర్కొన్నారు.

Wednesday, August 12, 2020

Low pressure over Bay to trigger rain in Andhra Pradesh in next four days

 ఏపీకి భారీ వర్ష సూచన
నైరుతి రుతుపవనాల చురుగ్గా విస్తరించడంతో ఆంధ్రప్రదేశ్ లో వరుసగా రెండో ఏడాది విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుండడంతో మళ్లీ వానలు దంచికొట్టనున్నాయి. రాగల నాలుగు రోజులు ముఖ్యంగా విశాఖపట్టణం, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలో కుండపోత వర్షాలు కురవొచ్చని భారత వాతావరణశాఖ (ఐఎండీ) వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. మంగళవారం 8 గంటల వరకు పార్వతీపురం (విజయనగరం) లో 8 సెం.మీ., వీరఘట్టం (శ్రీకాకుళం జిల్లా)లో అత్యధిక వర్షపాతం నమోదయినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. గురువారం (ఆగస్టు 13) న వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందన్నారు. దాంతో అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తు నిర్వహణ అథారిటీకి ముందస్తు సూచనలు జారీ అయ్యాయి. మూడు కోస్తా జిల్లాలతో పాటు కర్నూలును భారీ వానలు ముంచెత్తవచ్చని అంచనా వేస్తున్నారు.

Saturday, August 8, 2020

Air India Express Plane Touched Down 1km from Beginning of Runway Before Crashing

వందల ప్రాణాలు కాపాడిన బోయింగ్-737 పైలట్లు

కోజికోడ్ బోయింగ్-737 విమాన ప్రమాదంలో పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం జరగకుండా పైలట్లు చాకచక్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో గల్ఫ్ దేశాల్లో చిక్కుబడిన భారతీయుల్ని స్వదేశానికి తీసుకువస్తున్న వందేభారత్ విమానం శుక్రవారం ఘోర ప్రమాదానికి గురికాగా సుమారు 20 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అయితే ఈ విమాన పైలట్లు సమయస్ఫూర్తి వల్లే పెద్ద సంఖ్యలో ప్రాణనష్టం నివారించగలిగారు. ప్రమాదాన్ని పసిగట్టిన పైలట్లు విమానంలో మిగిలి ఉన్న ఇంధనం పూర్తిగా వినియోగం అయ్యే వరకు గాల్లోనే చక్కర్లు కొట్టించారు. దాంతో విమానం భస్మీపటలం కాకుండా కాపాడగలిగారు. అయితే క్రాష్ ల్యాడింగ్ లో పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలపై వాతావరణం అనుకూలించని పరిస్థితిలో ల్యాడింగ్ రిస్క్ మరింత అధికం. కేరళలోని కోజికోడ్ టేబుల్ టాప్ రన్ వే పై అదే చోటు చేసుకుంది. గత నాల్గు రోజులుగా కేరళ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాంతో వందేభారత్ (ఎయిర్ ఇండియా) విమాన పైలట్లకు రన్ వే స్పష్టంగా కనిపించలేదు. పైగా ఈ తరహా టేబుల్ టాప్ రన్ వేలు ఇతర రన్ వేల కన్నా చాలా చిన్నవి. మనదేశంలో పదేళ్ల క్రితం కర్ణాటక (మంగుళూరు)లో ఇదే విధంగా గల్ఫ్ దేశాల నుంచి వచ్చిన ఎయిరిండియా బోయింగ్- 737 విమానం కూలిపోయింది. 160 మంది నాటి దుర్ఘటనకు బలయ్యారు. ఇటువంటి అత్యంత ప్రమాదకరమైన టేబుల్ టాప్ రన్ వే దేశంలో మొత్తం మూడు ప్రాంతాల్లో ఉన్నాయి. ఒకటి మంగుళూరు, రెండు కోజికోడ్ కాగా మూడోది లేంగ్ వ్యూ(మిజోరం) లో ఉంది. తాజాగా ప్రమాదానికి గురైన 9-1344 విమాన పైలట్లు రన్ వే నం.9 కనిపించక పలుమార్లు ఏటీసీతో సంప్రదించారు. అనంతరం వారి కోరిక మేరకు రన్ వే 10 పై విమానాన్ని దించడానికి ఏటీసీ అనుమతి తీసుకుని ప్రయత్నించారు. 2,700 మీటర్ల మొత్తం రన్ వేలో పైలట్లు సుమారు 1000 మీటర్ల రన్ వే వద్ద ల్యాడింగ్ కు సిద్ధపడ్డారు. ఈ దశలోనే విమానం భారీ కుదుపులకు లోనై రన్ వే నుంచి దూసుకుపోయి 50 అడుగుల లోతుగల లోయలో పడిపోయి రెండుగా విడిపోయింది. దాంతో ఈ ప్రమాదంలో ఇద్దరు పైలట్లతో పాటు 18 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై డీజీసీఏ అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేపట్టింది.