ఏపీ ఎస్ఈసీగా మళ్లీ రమేశ్ కుమార్ బాధ్యతలు
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ)గా మరోసారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్
బాధ్యతలు చేపట్టారు. సుదీర్ఘకాలం న్యాయస్థానాల్లో పోరాటం చేసిన అనంతరం ఆయన ఇటీవల
ఎస్ఈసీగా పునర్నియామకం పొందిన సంగతి తెలిసిందే. దాంతో ఏపీలో రాజకీయ దుమారం రేపిన
నిమ్మగడ్డ ఎపిసోడ్ ఎట్టకేలకు ముగిసినట్లయింది.
సోమవారం ఉదయం 11.15 గంటలకు తిరిగి
ఎస్ఈసీగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల రాష్ట్ర గవర్నర్ జారీ చేసిన
నోటిఫికేషన్‌కు అనుగుణంగా నిమ్మగడ్డ పూర్వపు హోదాలో సోమవారం ఆఫీసుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు సమాచారం ఇచ్చారు. `రాష్ట్ర గవర్నర్ నోటిఫికేషన్ కు అనుగుణంగా నేను బాధ్యతలు చేపట్టా` అని ఆయన ఎన్నికల కమిషన్ కార్యదర్శి, జిల్లా
కలెక్టర్లు, ఇతర అధికారులకు తెలిపారు. `ఎన్నికల సంఘం స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ వ్యవస్థ.. రాగద్వేషాలకు
అతీతంగా పనిచేస్తుంది.. గతంలో మాదిరిగానే
ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుందని
ఆశిస్తున్నా` అని అధికారులకు పంపిన సర్క్యులర్ లో నిమ్మగడ్డ
పేర్కొన్నారు. కరోనా ప్రబలుతున్న నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో జరగాల్సిన స్థానిక
ఎన్నికల్ని ఆయన వాయిదా వేశారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న వై.ఎస్.ఆర్.సి.పి.ని
కనీసం సంప్రదించకుండా ఏకపక్షంగా ఆయన ఎన్నికల వాయిదా నిర్ణయాన్ని తీసుకున్నారని
సర్కారు మండిపడింది. పాత్రికేయుల సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ ఆయనపై
ఆక్రోశం వెళ్లగక్కారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ హోదాలో ఉన్న నిమ్మగడ్డ టీడీపీకి
అనుకూలంగా వ్యవహరిస్తున్నారని రాష్ట ప్రభుత్వం తరఫున పలువురు ఆయనపై తీవ్ర విమర్శలు
గుప్పించారు. ఆ క్రమంలోనే ఆయన పదవీకాలన్ని తగ్గించి కొత్త ఎస్ఈసీగా తమిళనాడు
హైకోర్టుకు చెందిన రిటైర్డ్ న్యాయమూర్తి కనగరాజ్‌ను నియమించారు. దాంతో నిమ్మగడ్డ
ఏపీ ఆర్డినెన్స్‌ను సవాల్ చేస్తూ హైకోర్టును ఆశ్రయించగా కోర్టు ఆర్డినెన్స్‌ను
కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు
మెట్లెక్కింది. అక్కడ కూడా ఎదురు దెబ్బ తగలడంతో నిమ్మగడ్డను తిరిగి ఎస్ఈసీగా
నియమించక తప్పలేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా
నిమ్మగడ్డ రమేశ్ కుమార్‌ను పునర్నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జూలై 30 అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గవర్నర్ విశ్వభూషణ్
హరిచందన్ ఒక ప్రకటన జారీ చేశారు. గెజిట్ విడుదల చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులు
ఇచ్చారు. దానికి అనుగుణంగా సోమవారం మళ్లీ ఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేశ్ బాధ్యతలు
చేపట్టారు.