చైనాలో రష్యా పులి `బోరిస్`
సైబేరియన్ జాతికి చెందిన ప్రఖ్యాత పెద్దపులి బోరిస్ ను చైనా అడవుల్లో ఇటీవల గుర్తించారు. ఇది రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పులిగా పేరొందింది. చైనా-రష్యా సరిహద్దుల్లోని అడవిలో అస్వస్తతతో ఉండగా ఈ పులిని రక్షించి అముర్స్కి టైగర్ (అముర్ టైగర్) కేంద్రానికి తరలించారు. అక్కడ సంపూర్ణ ఆరోగ్యం పొందిన తర్వాత 2014లో స్వయంగా పుతిన్ దాని సహజ ఆవాసమైన అడవుల్లోకి వదిలారు. బోరిస్ తో పాటు గర్ల్ ఫ్రెండ్ `స్వెత్లయ` కూడా పుతిన్ చేతుల మీదుగా నాడు అరణ్యానికి తరలింది. ఈ జంట రెండు పిల్లలకు జన్మనిచ్చాయి. తాజాగా పుతిన్ పులి బోరిస్ ను చైనా `తైపింగ్గౌ నేషనల్ నేచర్ రిజర్వ్` లో గుర్తించారు. దీని అసాధారణ చర్మం వల్లే ఛాయాచిత్రాల ద్వారా సులభంగా కనుగొనగలిగారు. రాజసం ఉట్టిపడే బోరిస్ పులికి ఓ వైపు చారలు లేని ప్రదేశం ఉండడం విశేషం. దాని ద్వారానే ఈ పులిని తేలిగ్గా గుర్తించగల్గుతున్నారు.