తొలిసారి ముసుగులో కేసీఆర్
తెలంగాణ సీఎం కేసీఆర్ తొలిసారి మాస్క్ ధరించారు. కరోనా వ్యాప్తి నిరోధానికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తదితరాలపై ఆయన సోమవారం ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్చి 1న హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌కు కరోనా పాజిటివ్ వచ్చిన నెలన్నర తర్వాత తొట్టతొలిసారి సీఎం కేసీఆర్ మాస్క్ ధరించారు. రాష్ట్రంలో ఇప్పటికే మాస్క్ ధరించడం తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. సర్జికల్ మాస్క్ ధరించి వచ్చిన ముఖ్యమంత్రితో పాటు ఈ సమావేశంలో వైద్యఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ ముఖ్యసలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, ముఖ్య కార్యదర్శి ఎస్.నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు. మంత్రులైనా, పోలీస్ అధికారులైనా చేతులు సబ్బుతో కడుక్కున్న అనంతరం శానిటైజర్‌తో రబ్ చేసుకున్న తర్వాతే లోపలికి రావాలనే నిబంధన ప్రగతి భవన్ లో అమలు చేస్తున్నారు. ఇక సమీక్షా సమావేశం, కేబినెట్ భేటీ ఏదైనా సామాజిక దూరం పాటిస్తున్నారు. అనంతరం జరిగే ప్రెస్మీట్స్ లోనూ జర్నలిస్టులందరూ సామాజిక దూరం పాటించేలా కుర్చీలు దూరంగా వేస్తుండడం తెలిసిందే. ఇక ఇంటి నుంచి బయటకు వచ్చే వారెవరైనా ముక్కు, నోటిని కప్పిఉంచేలా మాస్క్ ధరించాలని సర్కారు స్పష్టం చేసింది. మార్కెట్లో కొరత ఉంటే ఇంట్లోనే మాస్క్ తయారుచేసుకోవాలని, కనీసం కర్చీఫ్ (చేతి రుమాలు)నైనా వాడాలని సూచించింది.