రాహుల్
కు కరోనా పరీక్షలు
ఇటీవల
ఇటలీ వెళ్లి తిరిగి వచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు
ఆ పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఫిబ్రవరి 4న ఇటలీలోని మిలన్ కు వెళ్లిన రాహుల్ అక్కడ
రెండువారాల పాటు గడిపిన అనంతరం అదే నెల 29న ఢిల్లీ తిరిగి వచ్చారు. అందరితో పాటు రాహుల్
కూడా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో క్యూలో నిల్చుని కరోనా స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకున్నారు. రాహుల్ గాంధీతోపాటు ఆయన తల్లి సోనియా గాంధీ కరోనా పరీక్షలు చేయించుకోవాలని
రాజస్థాన్ కు చెందిన నాగౌర్ స్వతంత్ర ఎంపీ హనుమాన్ బేనివాల్ పార్లమెంట్లో డిమాండ్
చేసిన సంగతి తెలిసిందే. బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరీ కూడా రాహుల్ కరోనా పరీక్షల గురించి
నిలదీశారు. చైనాలోని వుహాన్ తర్వాత ఇటలీలోనే కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదై
80 మందికి పైగా మృత్యువాత పడ్డారు. కరోనా ప్రభావిత దేశాల జాబితాలో ఆ తర్వాత స్థానంలో
దక్షిణకొరియా నిలుస్తోంది. చైనాలో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య తగ్గగా ఇటలీ, దక్షిణకొరియాల్లో
వ్యాధి తీవ్రంగా ప్రబలుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 90కి పైగా దేశాలు కరోనా బెడదతో
అల్లాడుతున్నాయి. ఇదిలావుండగా దేశంలో కరోనా అప్రమత్తత విషయంలో మోదీ సర్కార్ పై ఇటీవల
రాహుల్ సెటైర్లు వేశారు. ‘భయపడొద్దు నౌక మునగదు అని టైటానిక్ షిప్ కెప్టెన్ ఎడ్వార్డ్
జాన్ స్మిత్ ప్రయాణికులకు చెప్పినట్లుగా కరోనా సంక్షోభం అదుపులోనే ఉందని ప్రభుత్వం
చెబుతోంది’ అంటూ రాహుల్ విమర్శలు
రువ్వారు. దాంతో కొందరు బీజేపీ నేతలు ఆయనను టార్గెట్ చేశారు. రాహుల్ తోపాటు ఆయన తల్లి
యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీకి కరోనా పరీక్షలు తప్పనిసరి అని వ్యాఖ్యానించారు. ఈ
నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కరోనా పరీక్షలు చేయించుకున్నారంటూ
వివరణ ఇచ్చింది.