గాంధీ ఆసుపత్రిలో
హైడ్రామా: డాక్టర్ ఆత్మహత్యాయత్నం
హైదరాబాద్
గాంధీ ఆసుపత్రిలో ఓ వైద్యుడు ఆత్మహత్యకు యత్నించడంతో హైరానా నెలకొంది. మంగళవారం డాక్టర్ వసంత్ కుమార్ (ఎంబీబీఎస్) తన చొక్కాలో పెట్రోల్ సీసాలను పెట్టుకుని లైటర్ తో
నిప్పంటించుకుంటానంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఉదయం గంటన్నరపాటు నడిచిన ఈ
హైడ్రామాకు పోలీసులు చాకచక్యంగా తెరదించారు. చెట్టు కింద నిలబడి వసంత్ తన ఆవేదనను
వ్యక్తం చేస్తుండగా పెద్ద సంఖ్యలో మీడియా ప్రతినిధులు, పోలీసులు అక్కడకు
చేరుకున్నారు. గర్భిణిగా ఉన్న ఆయన భార్య కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. అదును
చూసుకుని ఒక్కసారిగా పోలీసులు వసంత్ ను ఒడిసి పట్టుకుని ఆయన చేతిలో ఉన్న లైటర్ ను
లాగేసుకున్నారు. వ్యాన్ లోకి ఆయనను బలవంతంగా ఎక్కించారు. వసంత్ షర్టును విప్పేసి అందులో
దాచుకున్న పెట్రోల్ సీసాల్ని తీసి దూరంగా విసిరేశారు. అనంతరం అదుపులోకి
తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. `గాంధీ`లో కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు సోషల్
మీడియాలో వసంత్ తదితరులు వదంతులు రేపారని ప్రభుత్వం ఆయనతో పాటు మరో ముగ్గురు
వైద్యుల్ని విధులు నుంచి సస్పెండ్ చేసింది. మూడ్రోజులుగా వసంత్ తన పై అధికారులపై
అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. గాంధీ
హాస్పిటల్ సూపరింటెండెంట్ శ్రవణ్, డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ రమేశ్
రెడ్డి(డీఎంఈ) అవకతవకలకు పాల్పడుతున్నారంటూ వసంత్ తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే
డీఎంఈ మీడియాతో మాట్లాడుతూ వసంత్ పైనే గత కొంతకాలంగా అవినీతి, బ్లాక్ మెయిలింగ్
ఆరోపణలు ఉన్నాయన్నారు. వాస్తవానికి మెరుగైన వైద్య సేవలు అందుతున్నందునే గాంధీ
ఆసుపత్రి నేడు ఎంతో పేరు ప్రఖ్యాతులు పొందుతోందన్నారు. ఒకవేళ ఆసుపత్రిలో సౌకర్యాల
లేమి, అవకతవకలుంటే ఆయన ఉన్నతాధికారుల దృష్టికి ఎందుకు తీసుకురాలేదని డీఎంఈ ఎదురు
ప్రశ్న వేశారు. ఒక డాక్టర్ అయి ఉండి కరోనా వంటి సంక్షోభ సమయంలో ఆసుపత్రి ఆవరణలోనే
బరితెగింపు ధోరణి కనబర్చడమేంటని నిలదీశారు. శాఖాపరంగా డాక్టర్ వసంత్ పై చర్యలు
తీసుకోక తప్పదని చెప్పారు.