చరిత్ర పుటల్లో ఐఏఎఫ్ అస్త్రం మిగ్-27
భారత వైమానిక దళం (ఐఏఎఫ్)
అమ్ములపొదిలో ప్రధాన అస్త్రంగా భాసిల్లిన మిగ్-27 యుద్ధ విమానాలు ఇక
చరిత్ర పుటల్లో మిగిలిపోనున్నాయి. 1999లో పాకిస్థాన్ మూకలతో జరిగిన కార్గిల్
యుద్ధం నుంచి భారత తురఫుముక్కగా మిగ్-27 ఇతోధిక సేవలందించింది.
భారత సైన్యంతో `బహుదూర్` గా కీర్తి పొందిన ఈ రష్యా తయారీ మిగ్-27 కాలమాన క్రమంలో `ప్రాణాంతక`
లోహ విహాంగంగా భయపెట్టింది. శుక్రవారం జోద్ పూర్ ఎయిర్ బేస్ నుంచి చివరి మిగ్-27 నిష్క్రమణ (డీ
కమిషన్) పూర్తయింది. ఈ ఎయిర్ బేస్ నుంచి ఏడు మిగ్-27లతో స్క్వాడ్రన్ లీడర్లు
ఆకాశంలో చక్కర్లు కొట్టి డీకమిషన్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ ఏడాది బాలాకోట్ పై
భారత్ వైమానిక దళం మెరుపుదాడులు (సర్జికల్ స్ట్రయిక్స్) చేసిన అనంతరం పాక్ శత్రు
విమానాలు భారత్ గగనతలంలోకి దూసుకువచ్చే ప్రయత్నం చేశాయి. స్క్వాడ్రన్ లీడర్
అభినందన్ వర్ధమాన్ ఈ మిగ్-27 విమానంతోనే పాక్
అత్యాధునిక ఎఫ్-27 (అమెరికా తయారీ)
యుద్ధ విమానాల్ని నిలువరించడమే కాకుండా ఓ ఫైటర్ క్రాఫ్ట్ ను నేల కూల్చిన సంగతి
తెలిసిందే. జోధ్ పూర్ ఎయిర్ బేస్ లో మిగ్-27 డీకమిషన్ కార్యక్రమం సందర్భంగా
రక్షణశాఖ అధికార ప్రతినిధి కల్నల్ సొంబిత్ ఘోష్ పాత్రికేయులతో మాట్లాడారు. ఈ ఎయిర్
బేస్ నుంచి ఇక మిగ్-27లు కార్యకలాపాలు
నిర్వహించబోవన్నారు. ఐఏఎఫ్ సేవల నుంచి తప్పించిన ఈ విమానాల భవిష్యత్ గురించి
ఇప్పటికింకా కచ్చితమైన నిర్ణయం ఏదీ తీసుకోలేదన్నారు. వీటిని దేశీయ అవసరాలకు వినియోగించడమా,
ఇతర దేశాలకు తరలించడమా అనేది అనంతర కాలంలో తేలనుందని చెప్పారు.