ఝార్ఖండ్ సీఎంగా హేమంత్ సోరెన్: జేవీఎం బేషరతు మద్దతు
ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జయభేరి మోగించిన మహాఘట్ బంధన్ రాష్ట్రంలో
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. రాష్ట్ర అయిదో సీఎంగా హేమంత్ సోరెన్ నియమితులు
కానున్నారు. మంగళవారం ఆయన మాజీ ముఖ్యమంత్రి జేవీఎం అధినేత బాబూలాల్ మరాండీని రాంచీలోని
ఆయన నివాసంలో కలుసుకున్నారు. ఈ ఎన్నికల్లో మరాండీ ధన్వార్ నుంచి గెలుపొందగా జేవీఎం
పార్టీ మొత్తం 3 స్థానాలను కైవసం చేసుకుంది. మొత్తం 81 స్థానాల అసెంబ్లీలో ప్రభుత్వ
ఏర్పాటుకు 41 ఎమ్మెల్యేల బలం అవసరం. కాగా మహాఘట్ బంధన్ లోని ఝార్ఖండ్
ముక్తిమోర్చా(జేఎంఎం) 30, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 1 తదితర పార్టీల మద్దతుతో హేమంత్
తదుపరి ముఖ్యమంత్రి కానున్నారు. తాజాగా జేవీఎం(పి) బేషరతుగా మద్దతు తెలిపింది. హేమంత్
తండ్రి శిబుసోరెన్ ఝార్ఖండ్ కు మూడుసార్లు ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. జేఎంఎం
వ్యవస్థాపక అధ్యక్షుడు సోరెన్ కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రిగాను పనిచేశారు. అయితే
ఆయనపై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. 1994లో శిబు సోరెన్ ప్రయివేట్ సెక్రటరీ
శశినాథ్ ఝా హత్యకు గురయ్యారు. అందులో ఆయన పాత్ర నిరూపణ కావడంతో 2006లో అరెస్టయి జీవితఖైదు అనుభవిస్తున్నారు.
బీజేపీ ఓటమితో కాంగ్రెస్ సంబరం
జేఎంఎం నేతృత్వంలోని మహాకూటమి మెజారిటీ మార్కును దాటి
హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా తమ కూటమి అధికారంలోకి రానుండడంతో కాంగ్రెస్ సంబరాలు
జరుపుకుంటోంది. ఝార్ఖండ్ ఏఐసీసీ కమిటీ ఇన్ ఛార్జీ ఆర్పీఎన్ సింగ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల జీవితాలు, జీవనోపాధిని ప్రభావితం చేసే సమస్యలను లేవనెత్తి ఎన్నికలలో పోరాడి తాము అధికారానికి వచ్చామన్నారు. ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ప్రజల దృష్టిని ప్రాథమిక సమస్యల
నుంచి మళ్లించడానికి యత్నించి చివరకు ఓటమి పాలయ్యారని చెప్పారు. ఈ ఫలితాలు బీజేపీ అహంకార, అవినీతిమయ పాలనకు చెంపపెట్టుగా రాష్ట్ర ఎన్నికల
కాంగ్రెస్ సమన్వయకర్త అజయ్ శర్మ పేర్కొన్నారు.