Monday, December 16, 2019

On Dharna Against Jamia Crackdown, Priyanka Gandhi Says 'It's Attack on India's Soul'

ఇండియా గేట్ వద్ద ప్రియాంకగాంధీ `నిశ్శబ్ద నిరసన`

పౌరసత్వ చట్టం సవరణకు వ్యతిరేకంగా జామియా మిలియా ఇస్లామియా వర్సిటీ సహా దేశంలోని పలు విశ్వవిద్యాలయాల విద్యార్థులు వ్యక్తం చేస్తున్న నిరసనకు కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ సంఘీభావం తెలిపారు. సోమవారం ఆమె కాంగ్రెస్ నాయకులు, శ్రేణులు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులతో కలిసి రాజధాని ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద నిశ్శబ్ద నిరసన వ్యక్తం చేశారు. సాయంత్రం 4కు ఆమె ధర్నాకు కూర్చున్నారు. రెండుగంటల పాటు ఆందోళన నిర్వహించిన అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడారు. పౌరసత్వ సవరణ చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని `నాశనం` చేయడానికే దీన్ని కేంద్రప్రభుత్వం తీసుకువచ్చిందని ఆమె విరుచుకుపడ్డారు. ఈ చట్టానికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమిస్తుంటే వారిపై దాడికి దిగడం `భారత ఆత్మపై దాడి`గా ప్రియాంక పేర్కొన్నారు. ఆదివారం జామియా విద్యార్థులపై పోలీసుల అణిచివేత చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. నియంతగా మారుతున్న మోదీకి వ్యతిరేకంగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పోరాడతారని ప్రియాంక గాంధీ అన్నారు. ఆర్థికవ్యవస్థ, మహిళలు, విద్యార్థులపై మోదీ సర్కారు వరుసగా దాడికి పాల్పడుతోందని విమర్శించారు. హింసాత్మక నిరసనల వెనుక కాంగ్రెస్ హస్తం ఉందని ప్రధాని చేసిన ఆరోపణలను కాంగ్రెస్ అగ్రనేత గులాంనబీ అజాద్ తీవ్రంగా ఖండించారు. జామియాలో పోలీసు ప్రవేశానికి ఆదేశాలు ఇచ్చిన వారిపై కేసు బుక్ చేయాలని సీపీఐ ప్రధానకార్యదర్శి రాజా కోరారు. ఈ ఘటన బాధ్యులపై సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఆధ్వర్యంలో దర్యాప్తు చేయాలని సీపీఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచురీ డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్, ఆర్జేడీ నేత మనోజ్, ఎస్పీ నాయకుడు జావేద్ అలీఖాన్, జేడీ(యు) సీనియర్ నేత శరద్ యాదవ్ తదితరులు పాల్గొని విద్యార్థులపై పోలీస్ చర్యను ఖండించారు.

Tuesday, December 10, 2019

Group of youth sit outside Smriti Irani`s house to meet her in support of DCW chief`s movement

స్మృతి ఇరానీ ఇంటి ఎదుట నిరసన జ్వాల
ఢిల్లీ మహిళా కమిషన్ (డి.సి.డబ్ల్యు) చైర్ పర్సన్ స్వాతి మలివాల్ డిమాండ్ కు మద్దతు తెలుపుతూ నగర యువత మంగళవారం కదం తొక్కారు. కేంద్ర మహిళా,శిశు సంక్షేమ శాఖ మంత్రి  స్మృతి ఇరానీ ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న యువతీయువకులు ధర్నాకు దిగారు. ఆమెను కలవాలని పట్టుబట్టారు. గేట్ల వద్ద మోహరించిన సెక్యూరిటీ సిబ్బందితో  పెద్ద ఎత్తున  వాగ్వాదానికి దిగారు. రేపిస్టులకు ఆర్నెల్ల లోపు ఉరిశిక్ష విధించాలని గత ఎనిమిది రోజులుగా స్వాతి నిరాహార దీక్ష చేస్తున్నా ప్రభుత్వానికి ఎందుకు పట్టడం లేదని నినాదాలు చేశారు. `అత్యాచారదోషుల్ని ఉరి తీయాలి`.. `ఆరునెలల్లో మరణశిక్ష విధించాలి` అని ఖాళీ పళ్లాలపై రాసిన నినాదాల్ని ప్రదర్శించారు. రేపిస్టుల్ని సత్వరం ఉరికంబం ఎక్కించాలని నిరశన తెల్పుతున్న స్వాతి ఆరోగ్యం రోజురోజుకు క్షీణిస్తున్నా పట్టనట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలిచ్చారు. మంత్రి ఇరానీ ఇంట్లో లేరని భద్రత సిబ్బంది వారిస్తున్నా ఆందోళనకారులు పట్టువీడకుండా ఆ ప్రాంతాన్ని దిగ్బంధించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు పలువురు ఆందోళనకారుల్ని అక్కడ నుంచి బస్సుల్లో మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయినా మరికొందరు ఆందోళనకారులు ఆ ప్రాంతానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాంతో మంత్రి కార్యాలయ అధికారి ఒకరు ఆందోళనకారుల వద్దకు వచ్చి ఈ విషయాన్ని సత్వరం ఆమెకు చేరవేస్తామని హామీ ఇచ్చి వారికి నచ్చచెప్పారు. దాంతో శాంతించిన నిరసనకారులు ధర్నాను విరమించారు.

Friday, December 6, 2019

It`s a lesson to the rapist`s:Chiru and Balaiah


రేపిస్టులకు ఇదో గుణపాఠం: చిరంజీవి
షాద్ నగర్ ప్రాంతంలోని చటాన్ పల్లిలో శుక్రవారం తెల్లవారుజామున పోలీసులు నిర్వహించిన ఎన్ కౌంటర్ రేపిస్టులకు గొప్ప గుణపాఠం వంటిందని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నారు. `దిశ` విషాదాంతంలోని నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారన్న వార్తను ఉదయం టీవీలో చూశానన్నారు. నిజంగా దీంతో ఆ  కుటుంబానికి సత్వర న్యాయం లభించినట్లేనని చెప్పారు. ఈ ఎదురుకాల్పులతో దిశ తల్లిదండ్రుల ఆవేదనకు కొంత ఊరట లభిస్తుందన్నారు. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కిరావడం అభినందనీయమని మెగాస్టార్ చెప్పారు. సీపీ సజ్జనార్‌ సహా యావత్ తెలంగాణ పోలీస్‌ శాఖకు, సీఎం కేసీఆర్‌ కు చిరంజీవి అభినందనలు తెలిపారు.

దేవుడే పోలీసుల రూపంలో వచ్చాడు:బాలకృష్ణ
మరో టాలీవుడ్ వెటరన్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఈ ఎన్ కౌంటర్ పై స్పందిస్తూ దేవుడే పోలీసుల రూపంలో వచ్చి `దిశ` నిందితులకు సరైన శిక్ష విధించాడన్నారు. ఎవరూ మరోసారి ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడబోరని, అసలు అటువంటి ఆలోచనే మొలకెత్తదని.. అందుకు తగిన సందేశాన్ని తాజా ఎన్ కౌంటర్ ద్వారా పోలీసులు సమాజానికి అందించినట్లు చెప్పారు. అందరికీ ఇదొక గుణపాఠం కావాలన్నారు. ``దిశ` ఆత్మకు ఇప్పుడు శాంతి చేకూరిందిఅని బాలకృష్ణ పేర్కొన్నారు.

Thursday, December 5, 2019

SC grants bail to Chidambaram in INX Media money laundering case


ఎట్టకేలకు చిదంబరానికి బెయిల్
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు పి.చిదంబరానికి ఎట్టకేలకు బెయిల్ లభించింది. ఐ.ఎన్.ఎక్స్ మీడియా ముడుపులు, మనీ లాండరింగ్ కేసులో సీబీఐ, ఈడీ ఛార్జిషీట్లను ఎదుర్కొంటూ జైలు పాలైన 74 ఏళ్ల ఈ కాంగ్రెస్ కురువృద్ధ నేతకు జస్టిస్ ఎ ఎస్ బోపన్న, హృషికేశ్ రాయ్ లతో కూడిన సుప్రీం ధర్మాసనం బుధవారం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. చిదంబరం బయట ఉంటే ఈ కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయొచ్చన్న హైకోర్టు వాదనను దేశ సర్వోనత న్యాయస్థానం తోసిపుచ్చింది. 105 రోజులుగా చిదంబరం తీహార్ జైలులో గడుపుతున్న సంగతి తెలిసిందే. నవంబర్ 15న ఢిల్లీ హైకోర్టు తనకు బెయిల్ ను నిరాకరిస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చిదంబరం దాఖలు చేసిన అప్పీల్‌పై సుప్రీంకోర్టు ఈ తాజా తీర్పు ఇచ్చింది. ఈడీ తరఫున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా మాట్లాడుతూ మనీలాండరింగ్ వంటి ఆర్థిక నేరాలు చాలా తీవ్రమైనవని, అవి దేశ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేయడమే కాకుండా సమాజంలోని ప్రజల విశ్వాసాన్ని సడలిస్తాయని వాదించారు. చిదంబరం తరఫున కేసులో ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబల్, ఎ.ఎం. సింగ్వి మెహతాలు తమ వాదనలు వినిపిస్తూ ఆయన ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేశారని లేదా ఏదైనా సాక్ష్యాలను దెబ్బతీశారనడానికి ఎటువంటి ఆధారాలు లేవని సుప్రీం ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవిస్తూ కోర్టు చిదంబరానికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ముందస్తు అనుమతి లేకుండా చిదంబరం దేశం విడిచి వెళ్ళరాదని, మీడియాతో మాట్లాడకూడదని ధర్మాసనం ఆదేశించింది. చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో 2007 లో రూ .305 కోట్ల విదేశీ నిధులను అందుకునేందుకు ఐఎన్‌ఎక్స్ మీడియా గ్రూపునకు అనుమతులు మంజూరు అయ్యాయి. ఆ సంస్థకు విదేశీ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు (ఎఫ్‌.ఐ.పి.బి) క్లియరెన్స్‌ లు లభించడంలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సీబీఐ 2017 మే 15 న కేసు నమోదు చేసింది. ఆగస్టు 21న ఆయనను అరెస్ట్ చేసింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ చిదంబరాన్ని అక్టోబర్ 16న అరెస్ట్ చేసింది. దాంతో సీబీఐ కేసులో అక్టోబర్ 22న ఆయన బెయిల్ పొందినా ఈడీ అరెస్ట్ కారణంగా తీహార్ జైలులోనే అప్పటి నుంచి ఉండిపోవాల్సి వచ్చింది. అంతకుముందు ఇవే కేసుల్లో ఆయన కుమారుడు శివగంగ ఎంపీ కార్తీ చిదంబరం అరెస్టయ్యారు. తీహార్ జైలులో కొద్ది రోజులున్న అనంతరం బెయిల్ పై విడుదలయ్యారు. కార్తీ కూడా విదేశాలకు అనుమతి లేకుండా వెళ్లరాదని అప్పట్లో కోర్టు షరతులతోనే బెయిల్ ఇచ్చింది.