Wednesday, October 2, 2019

BJP should first pursue path of truth and then talk about Mahatma Gandhi: Priyanka


బీజేపీ సత్యం చెప్పి.. అప్పుడు గాంధీజీ గురించి మాట్లాడాలి:ప్రియాంక
భారతీయ జనతా పార్టీ ముందు సత్యం పలకడం అలవాటు చేసుకుని ఆ తర్వాతే మహాత్మాగాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి ప్రియాంకగాంధీ ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ (యూపీ)లో కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన మౌన ప్రదర్శనలో పాల్గొనే ముందు విలేకర్లతో మాట్లాడారు. గాంధేయ మార్గంలో తొలుత పాటించాల్సింది నిజం చెప్పడం.. ఆ అంశాన్ని బీజేపీ గుర్తించి ఆచరించాలని ఆ తర్వాతే ఆయన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో గత కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మౌన పాదయాత్రతో తన బలాన్ని ప్రదర్శించేందుకు సమాయత్తమయింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్‌ తనపై అత్యాచారం జరిపారని ఆరోపించిన న్యాయ విద్యార్థికి మద్దతుగా ర్యాలీకి యత్నించిన సుమారు 80 మంది కాంగ్రెస్ కార్యకర్తలను సోమవారం యూపీ సర్కారు అరెస్ట్ చేసింది. బహిరంగ సభ అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి సిద్ధమైన దశలో పోలీసులు వారిని నిర్బంధించారు. ఈ అరెస్టుల్ని ప్రియాంక తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో `మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయి.. వాటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి గొంతెత్తిన వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.` యూపీ సర్కార్ నిరంకుశ వైఖరిపై తమ ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రియాంక హెచ్చరించారు.

Tuesday, October 1, 2019

Kejriwal greets president Ramnath Kovind on his birthday


రాష్ట్రపతి కోవింద్ కు పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ
భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ 74వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశంలో పలువురు నాయకులు మంగళవారం ఆయనను శుభాకాంక్షలతో ముంచెత్తారు. ప్రధాని నరేంద్రమోదీ, ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు, పశ్చిమబెంగాల్, ఢిల్లీ సీఎంలు మమతాబెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ కోవింద్ కు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రపతిజీకి జన్మదిన శుభాకాంక్షలు..దేశ సేవలో అంకితమయ్యేందుకు ఆయనను దేవుడు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలి..అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. జన్మదినం రోజున రాష్ట్రపతి వారణాసిలో విమానాశ్రయ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ దెహత్ జిల్లాలోని పరౌంఖ్ గ్రామంలో ఆయన 1 అక్టోబర్ 1945లో జన్మించారు. నేషనల్ డెమోక్రటిక్ అలయెన్స్ (ఎన్డీయే) అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల బరిలో నిలిచిన కోవింద్ యునైటెడ్ ప్రొగెసివ్ అలయెన్స్ (యూపీఏ) అభ్యర్థి లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ పై భారీ ఆధిక్యంతో గెలుపొందారు. 2017 జులై25 న ఆయన భారత రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు సుప్రీంకోర్టు న్యాయవాదిగా ఉన్న ఆయన రాజకీయాల్లో చేరిన తర్వాత బిహార్ గవర్నర్ గా పనిచేశారు.

Monday, September 30, 2019

Close associate of gangster Kapil Sangwan held in Delhi


గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ కీలక అనుచరుడి అరెస్ట్
దేశ రాజధాని ఢిల్లీలో సోమవారం తెల్లవారుజామున గ్యాంగ్ స్టర్ కపిల్ సంగ్వాన్ ముఠా లోని కీలక సభ్యుణ్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ ఉదయం ద్వారాక ప్రాంతంలో ఓ కారును అతను బైక్ పై వెంబడిస్తూ అటకాయించే ప్రయత్నం చేశాడు. తుపాకీతో కాల్పులకు తెగబడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతడిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ ఎన్ కౌంటర్ లో అతని ఎడమకాలులో నుంచి బుల్లెట్ దూసుకుపోవడంతో బైక్ పై నుంచి కింద పడ్డాడు. వెంటనే అతణ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి వద్ద నుంచి తుపాకీని స్వాధీనం చేసుకుని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతణ్ని కపిల్ సంగ్వాన్ ప్రధాన అనుచరుడు కుల్దీప్ రాథిగా గుర్తించినట్లు ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు తెలిపారు. దోపిడీ, దౌర్జన్యాలు, అపహరణలు, హత్య, హత్యా యత్నాలు, ఆయుధాలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, భూకబ్జాలు తదితర పలు కేసుల్లో రాథి నిందితుడన్నారు. జైలులో శిక్ష అనుభవిస్తున్న కపిల్ సంగ్వాన్ పెరోల్ పై ఈ జూన్ లో విడుదలైనప్పుడు పెద్ద ఎత్తున పార్టీ చేసుకునేందుకు ముఠా సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఆ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న కరుడగట్టిన అతడి అనుచరులు 15 మందిని స్పెషల్ సెల్ పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. నజఫ్ గఢ్ లోని గొయల డైరీ ప్రాంతంలో వీరంతా సమావేశమైనట్లు ఏఎస్ఐ దినేశ్ కుమార్ కు సమాచారం అందడంతో స్పెషల్ సెల్ ను అప్రమత్తం చేశారు. ఏసీపీ మనోజ్ పంత్ ఆధ్వర్యంలో స్పెషల్ సెల్ పోలీసులు రెండు జట్లుగా విడిపోయి ఈ ముఠాపై మెరుపుదాడి చేసి పట్టుకున్నారు.  పట్టుబడ్డ వారిలో ఇద్దరు కొత్తవారు కాగా మిగిలిన 13 మంది పలు దారుణాలకు పాల్పడి పోలీసు రికార్డులకు ఎక్కినవారే. ఈ గ్యాంగ్ కు చెందిన మరో ఎనిమిది మందిని సైతం 2018 జులైలో వసంత్ కుంజ్ ప్రాంతంలో పోలీసులు అరెస్ట్ చేశారు.

Sunday, September 29, 2019

Government bans onions export


ఉల్లి ఎగుమతులపై భారత సర్కారు నిషేధాస్త్రం
దేశంలో ఉల్లి కొరత నివారణ చర్యల్లో భాగంగా కేంద్రప్రభుత్వం ఎగుమతుల్ని నిషేధించింది. దేశవ్యాప్తంగా ఈ నిషేధ ఉత్తర్వులు తక్షణం అమలులోకి వచ్చాయి. ఆదివారం ఈ మేరకు ఉల్లి ఎగుమతుల విధానాన్ని సవరిస్తూ కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ ఉత్తర్వులిచ్చింది. గతంలో ఉల్లి ఎగుమతులపై ఎటువంటి పరిమితులు లేవు. ఆ నిబంధనను రద్దు చేస్తూ కేంద్రం సవరించిన ఉల్లి ఎగుమతుల నిషేధ ఉత్తర్వులు జారీ చేసింది. 2018-19 ఏడాదిలో భారత్ నుంచి రూ.3,497 కోట్ల ఉల్లి ఎగుమతులు జరిగాయి. దేశీయ మార్కెట్ లో చుక్కలనంటుతున్న ఉల్లి ధరల్ని దారిలోకి తెచ్చేందుకు కేంద్ర సర్కార్ 15 రోజుల క్రితం కనీస ఎగుమతి ధరను టన్నుకు రూ. 59,932గా నిర్ణయించింది. అయినా దేశీయ అవసరాలకు ఉల్లి అందుబాటులో లేకపోవడంతో విధి లేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈ మేరకు సాంతం ఉల్లి ఎగుమతులపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించాల్సి వచ్చింది. దేశంలో గరిష్ఠంగా ఉల్లిని ఉత్పత్తి చేసే రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక వరదలతో అల్లాడుతుండడంతో దిగుబడి తగ్గిపోయి గిరాకీ గణనీయంగా పెరిగింది. దాంతో ఎంతకూ ధరలు దిగిరావడం లేదు. భారత్ నుంచి ప్రధానంగా బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈలకు ఉల్లి ఎగుమతయ్యేది.