బీజేపీ సత్యం చెప్పి..
అప్పుడు గాంధీజీ గురించి మాట్లాడాలి:ప్రియాంక
భారతీయ జనతా పార్టీ ముందు సత్యం పలకడం అలవాటు చేసుకుని ఆ
తర్వాతే మహాత్మాగాంధీ సిద్ధాంతాల గురించి మాట్లాడాలని కాంగ్రెస్ ప్రధానకార్యదర్శి
ప్రియాంకగాంధీ ఎద్దేవా చేశారు. బుధవారం ఆమె గాంధీజీ 150వ జయంత్యుత్సవాల సందర్భంగా ఉత్తరప్రదేశ్ (యూపీ)లో
కాంగ్రెస్ నిర్వహించ తలపెట్టిన మౌన ప్రదర్శనలో పాల్గొనే ముందు విలేకర్లతో
మాట్లాడారు. గాంధేయ మార్గంలో తొలుత పాటించాల్సింది నిజం చెప్పడం.. ఆ అంశాన్ని బీజేపీ
గుర్తించి ఆచరించాలని ఆ తర్వాతే ఆయన గురించి మాట్లాడాలన్నారు. రాష్ట్రంలో గత
కొంతకాలంగా స్తబ్ధుగా ఉన్న కాంగ్రెస్ పార్టీ మౌన పాదయాత్రతో తన బలాన్ని ప్రదర్శించేందుకు
సమాయత్తమయింది. మాజీ కేంద్ర మంత్రి స్వామి చిన్మయానంద్ తనపై అత్యాచారం
జరిపారని ఆరోపించిన న్యాయ విద్యార్థికి మద్దతుగా ర్యాలీకి యత్నించిన సుమారు 80
మంది కాంగ్రెస్ కార్యకర్తలను సోమవారం యూపీ సర్కారు అరెస్ట్ చేసింది. బహిరంగ సభ
అనంతరం కాంగ్రెస్ శ్రేణులు ర్యాలీకి సిద్ధమైన దశలో పోలీసులు వారిని నిర్బంధించారు.
ఈ అరెస్టుల్ని ప్రియాంక తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో `మహిళలపై దురాగతాలు జరుగుతున్నాయి.. వాటికి వ్యతిరేకంగా పోరాడ్డానికి
గొంతెత్తిన వారిపై అరెస్టుల పర్వం కొనసాగుతోంది.` యూపీ సర్కార్ నిరంకుశ వైఖరిపై తమ
ఆందోళనలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ప్రియాంక హెచ్చరించారు.