సింగపూర్ లో శ్రీదేవి మైనపు
బొమ్మ ఆవిష్కరణ
మేడమ్ టుస్సాడ్స్ సింగపూర్ మ్యూజియంలో
ఆలిండియా స్టార్ హీరోయిన్ దివంగత శ్రీదేవి మైనపు ప్రతిమను బుధవారం ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఆమె భర్త, బాలీవుడ్ దర్శక నిర్మాత బోనీకపూర్, కూతుళ్లు జాన్వీ,
ఖుషీ, ఇతర కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆగస్ట్ 13న ఆమె జయంతిని పురస్కరించుకుని ఈ
మైనపు బొమ్మ తయారీని సంకల్పించినట్లు టుస్సాడ్స్ సింగపూర్ శాఖ వర్గాలు తెలిపాయి. `మిస్టర్
ఇండియా` చిత్రంలో ఆమె ధరించిన పాత్ర నమూనాలో ఈ ప్రతిమను తీర్చిదిద్దారు. 1987 లో విడుదలయిన
ఈ సినిమా సూపర్ హిట్ అయింది. ఈ చిత్రంలో `హవా హవాయి` అనే గీతం కూడా జనరంజకమయింది.
ఆ పాటలో శ్రీదేవి ధరించిన దుస్తులు, మేకప్ మాదిరిగా బొమ్మను రూపొందించారు. స్వర్ణ
వర్ణ కాంతులతో కూడిన మీగడ రంగు దుస్తులు, తలపై కిరీటం, చేతులకు కంకణాలతో అత్యంత
ఆకర్షణీయంగా తీర్చిదిద్దిన శ్రీదేవి మైనపు బొమ్మ సందర్శకుల్ని విశేషంగా
ఆకట్టుకుంటోంది. దిగ్గజ నటి శ్రీదేవి ప్రతిమ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆమె
కుటుంబసభ్యులు పాల్గొనడం పట్ల టుస్సాడ్స్ సింగపూర్ మ్యూజియం అధికారులు ట్విటర్ లో హర్షం
వ్యక్తం చేశారు.