చందమామపై విక్రమ్ ల్యాండర్.. అదే భారత అంతరిక్ష పితామహునికి
ఘన నివాళి:ప్రధాని మోది
చంద్రయాన్-2 ప్రయోగంలో కీలక
పార్శ్వమైన విక్రమ్ ల్యాండర్ చంద్రుడిపై దిగనుండడమే భారత అంతరిక్ష ప్రయోగ
పితామహుడు విక్రమ్ అంబాలాల్ సారాభాయ్ కి నిజమైన నివాళి అని ప్రధాని మోది పేర్కొన్నారు. విక్రమ్ సారాభాయ్ శత జయంత్యుత్సవాల్ని పురస్కరించుకుని అహ్మదాబాద్ లో
ఏర్పాటైన కార్యక్రమంలో ప్రధాని మోది వీడియో సందేశమిస్తూ ఆయన సేవల్ని
స్మరించుకున్నారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) వ్యవస్థాపకుడిగా విక్రమ్
సారాభాయ్ సేవలు చిరస్మరణీయమన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లోనే కాకుండా భారతీయ
సంస్కృతి, సంస్కృత భాషా వ్యాప్తికి ఎనలేని కృషి చేశారన్నారు. పిల్లల్లో ఆధునిక
శాస్త్ర విజ్ఞాన జిజ్ఞాసతో పాటు, భారతీయ సంస్కృతి విలువల్ని పెంపొందించడం, సంస్కృత
భాషా అభిలాషను ప్రోత్సహించేందుకు పాటు పడ్డారని ప్రధాని చెప్పారు. డాక్టర్ హోమీ
బాబా మరణంతో యావత్ ప్రపంచం శాస్త్రసాంకేత విజ్ఞాన రంగంలో ఎదుర్కొంటున్న లోటును విక్రమ్ సారాభాయ్
తీర్చారన్నారు. అంతరిక్ష ప్రయోగాలతో విశ్వ వ్యాప్తంగా నీరాజనాలందుకుంటున్న ఇస్రోను
నెలకొల్పిన విక్రమ్ సారాభాయ్ `భారతమాతకు నిజమైన పుత్రుడు` అని చైర్మన్ డాక్టర్ కె.శివన్
పేర్కొన్నారు. ఆయన ఓ అద్భుతమైన సంస్థకు అంకురార్పణ చేశారని కొనియాడారు. భౌతికశాస్త్రం,
ఆధునిక శాస్త్ర విజ్ఞానం, అణుశక్తి రంగాల్లో
విక్రమ్ సారాభాయ్ సేవలు నిరుపమానమన్నారు.
విక్రమ్ సారాభాయ్ ఆగస్ట్ 12, 1919లో
అహ్మదాబాద్ (ఉమ్మడి మహారాష్ట్ర) లో జన్మించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీలో ఉన్నత విద్యాభ్యాసం
చేశారు. 1942లో ఆయన ప్రఖ్యాత శాస్త్రీయ నృత్యకళాకారిణి మృణాళిని వివాహం చేసుకున్నారు. ఇస్రోతో
పాటు ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ అహ్మదాబాద్ (ఐఐఎంఎ) సంస్థలను
నెలకొల్పారు. భారత అణుశక్తి సంస్థ (అటామిక్ ఎనర్జీ
కమిషన్ ఆఫ్ ఇండియా) కి 1966-1971 వరకు చైర్మన్ గా వ్యవహరించారు. 1966లో ఆయనకు పద్మభూషణ్
అవార్డు లభించింది. 1971లో తన 52వ ఏట తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ పరమపదించారు. మరణానంతరం 1972లో ఆయనకు పద్మవిభూషణ్
పురస్కారం లభించింది.