`కాంగ్రెస్
సభ్యుల కంటికి ఒకే ఒక కుటుంబం కనిపిస్తుంది`: ప్రధాని ఎద్దేవా
ప్రధానమంత్రి
నరేంద్ర మోదీ మరోసారి కాంగ్రెస్ వంశపారంపర్య పాలనపై ధ్వజమెత్తారు. మంగళవారం లోక్
సభలో ఆయన ప్రసంగిస్తూ కేవలం ఒక కుటుంబం చుట్టూనే కాంగ్రెస్ పార్టీ
పరిభ్రమిస్తుందని వారి మాటే వేద వాక్కుగా పాటిస్తోందని విమర్శించారు. ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్ సభలో
సోమవారం కాంగ్రెస్ నాయకుడు అధిర్ రాజన్ చౌధురి మాట్లాడుతూ కాంగ్రెస్ మహానేతలు పండిట్ నెహ్రూ,
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీలు దేశానికి చేసిన సేవలు వివరించారు. ఆ సందర్భంలోనే ప్రధాని మోదీ గొప్ప మార్కెట్ నైపుణ్యం గల వ్యాపారవేత్తగా అధిర్ పేర్కొన్నారు. ఆయన తన ఉత్పత్తుల్ని బాగా అమ్మకోగలిగాడని కాంగ్రెస్ కు అది చేతకాక ఓటమి చెందిందన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సభలో ప్రధాని మోదీ స్వయంగా రంగంలోకి దిగారు. కాంగ్రెస్ సభ్యులు, గాంధీ నెహ్రూ కుటుంబ వారసత్వ ప్రధానులపై
ఎదురుదాడి చేశారు. కాంగ్రెస్ సభ్యులకు ఏరోజూ ప్రధానిగా వాజ్ పేయి హయాంలో జరిగిన
అభివృద్ధి గుర్తుకు రాలేదన్నారు. గాంధీ నెహ్రూ కుటుంబానికి చెందని కాంగ్రెస్
ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్ ల హయాంలో కార్యక్రమాల గురించి ఏ ఒక్క
కాంగ్రెస్ సభ్యుడు ప్రస్తుతించిన దాఖలా లేదని ప్రధాని మోదీ ప్రస్తావించారు. ఇదే
రోజు జూన్ 25న ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ చీకటి రోజులు తనకింకా
గుర్తున్నాయన్నారు. రాజ్యాంగ వ్యవస్థల్ని ఆఖరికి న్యాయవ్యవస్థను ఆమె గుప్పిట పట్టి
పాలించారని ఘాటుగా విమర్శించారు. 44 ఏళ్ల నాడు ఎమర్జెన్సీ చీకటి పాలనకు యావత్ దేశం
ఆత్మ క్షోభించిందన్నారు. ప్రధాని మోదీ ఈ విమర్శలు గుప్పిస్తున్నప్పుడు లోక్ సభ
ఎంపీలుగా ఎన్నికైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ సభలోనే ఉన్నారు. కొత్త భారత దేశ
నిర్మాణానికి బీజేపీ తపన పడుతోందన్నారు. దేశ ప్రజలు సమైక్యత, భద్రత, సురక్షితలను
కోరుకుంటున్నారని అందుకే మరోసారి బీజేపీకి తిరుగులేని అధికారాన్ని కట్టబెట్టారని
మోదీ వ్యాఖ్యానించారు.