పరిశోధనాత్మక
విద్యా విధానం రావాలి: ఉపరాష్ట్రపతి
బస్తాలకొద్దీ
పుస్తకాల్ని భుజాలకెత్తుకుని మోసుకెళ్లే విద్యావిధానంలో మార్పులు రావాలని
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఆదివారం ఇండియన్ ఇన్ స్టిట్యూట్
ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ(ఐ.ఐ.పి.ఇ) ఏర్పాటు చేసిన రెండ్రోజుల సదస్సులో ఆయన పలు
విలువైన సూచనలు చేశారు. పరిశ్రమలు, విద్యాసంస్థల సమన్వయంతో విద్యా ప్రమాణాల పెంపు
అనే అంశంపై జరిగిన ఈ సదస్సులో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పిల్లలకు తొలుత పుస్తకాల
సంచి బరువును తగ్గించాలన్నారు. ఆటపాటలతో పాటు విలువలు, సాంకేతిక, చారిత్రక,
తార్కిక ఆలోచనా ధోరణిని విద్యార్థులకు అలవర్చాలన్నారు. మెరుగైన విద్యావిధానం
ద్వారా ఉత్తమ శ్రేణి ఉద్యోగార్థులు మన ముందుకు వస్తారని అందుకు పరిశ్రమలు, సంస్థలు
విద్యా సంస్థలకు దీర్ఘకాలిక ప్రాతిపదికన తోడ్పాటును అందించాల్సి ఉంటుందన్నారు.
కొంగొత్త ఆవిష్కరణలకు విద్యార్థుల స్థాయి నుంచే పరిశోధనలు జరగాలని అందుకు పరిశ్రమలు
మరింత ముందడుగు వేసి విద్యాసంస్థలతో కలిసి పనిచేయాలన్నారు. వృత్తి విద్యా సంస్థల
నుంచి చాలా మంది విద్యార్థులు తగిన ఉద్యోగ నైపుణ్యాలు లేకుండానే బయటకు వస్తున్న
విషయాన్ని ఉపరాష్ట్రపతి ఈ సందర్భంగా గుర్తు చేశారు. పరిశ్రమలు, వ్యవసాయ అనుబంధ
రంగాల్లోనూ అభిరుచి, సామర్థ్యం, నైపుణ్యం అవసరమని ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు
కాదలచిన వారికి ఇవన్నీ ముఖ్యమని చెప్పారు. విద్యార్థులకు విద్యా నైపుణ్యంతో పాటు
జీవితానికి అవసరమయ్యే లోక జ్ఞానం, భాషా పటిమ, సాంకేతిక మెలకువలు,
ఔత్సాహిక నిపుణత తదితరాలు కూడా కావాలన్నారు. ప్రజలూ విద్యా విధానంపై సమగ్రంగా ఆలోచించి
తర్కించి.. చర్చించాకే ఓ నిర్ణయానికి రావాలని వెంకయ్యనాయుడు కోరారు. అప్పుడే విద్యా
విధానంలో సముచిత మార్పులు సాధ్యమన్నారు.