బీజేపీలో చేరిన ముగ్గురు పశ్చిమ
బెంగాల్ ఎమ్మెల్యేలు
పశ్చిమ బెంగాల్ కు
చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు. ఢిల్లీలో మంగళవారం (మే28) కమలం
తీర్థం పుచ్చుకున్న వారిలో ఆ రాష్ట్ర బీజేపీ నాయకుడు ముకుల్ రాయ్ కొడుకు సుబ్రంగ్షు
రాయ్ కూడా ఉన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో సైతం బీజేపీ అనూహ్యంగా
పుంజుకున్న సంగతి తెలిసిందే. సుబ్రంగ్షు రాయ్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని
భావించిన టీఎంసీ ఆయనను లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే సస్పెండ్ చేసింది.
టీఎంసీ ఎమ్మెల్యే తుషార్కంటి భట్టాచార్య, సీపీఎంకు చెందిన దేబేంద్ర నాథ్ రాయ్
తోపాటు పలువురు కౌన్సిలర్లు బీజేపీలో చేరారు. బీజేపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ
ప్రధానకార్యదర్శి కైలాస్ విజయవర్గియ, ముకుల్ రాయ్ సమక్షంలో వీరంతా కమలం పార్టీలో
చేరారు. బెంగాల్ లో అధినేత్రి మమత నేతృత్వంలోని టీఎంసీ నుంచి ఎమ్మెల్యేలను
కమలదళంలోకి చేర్చడంలో ముకుల్ రాయ్ కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. లోక్ సభ
తాజా ఫలితాల్లో పశ్చిమబెంగాల్ లో బీజేపీ సుమారు రెండు పదుల స్థానాలు కైవశం
చేసుకోవడంలో ఆయన తీవ్రంగా కృషి చేసినట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో
మమత 2011లో పాలనాపగ్గాలు చేపట్టినప్పటి తర్వాత ఈ సార్వత్రిక ఎన్నికల్లోనే తొలిసారి
టీఎంసీకి ఫలితాల్లో ఎదురుదెబ్బ తగిలింది. గత లోక్ సభ ఎన్నికల్లో టీఎంసీకి 34
స్థానాలు దక్కగా ఈసారి 22 స్థానాలకే పరిమితమయింది. బీజేపీ రాష్ట్రంలో 2 స్థానాల నుంచి
18 స్థానాలకు ఎగబాకింది.