అగ్నిప్రమాదం
నుంచి సురక్షితంగా బయటపడ్డ 55 మంది బాలికలు
పశ్చిమ ఢిల్లీలో బుధవారం (మే29) ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అయితే ఈ
ప్రమాదం బారినపడ్డ 55 మంది బాలికల్ని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సూరత్ లో ఇటీవల ఓ
ఆర్ట్ స్టూడియోలో అగ్నిప్రమాదం జరగ్గా 23 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన
విషయం విదితమే. ఢిల్లీ జనక్ పురి మెట్రో రైల్వే స్టేషన్ కు సమీపంలోని ఓ బాలికలు వసతి
గృహం(హాస్టల్)లో బుధవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. భారీ
అగ్నికీలలు చుట్టుముట్టగా పిల్లలు అల్లాడిపోయారు. దట్టమైన పొగ ఆ ప్రాంతమంతా
వ్యాపించింది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శకటాలతో సిబ్బంది
రంగంలోకి దిగారు. అందులోని బాలికలందర్నీ సురక్షితంగా వెలుపలికి తీసుకువచ్చారు.
అయితే వీరిలో ఆరుగురు బాలికలు అస్వస్థతకు గురికాగా వారిని సమీపంలో ఆసుపత్రికి
తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వీరిలో ఇద్దరు బాలికల్ని డిశ్చార్జ్ చేశారు.
మరో నలుగురు చికిత్స పొందుతున్నారు. వీరందరి ఊపిరితిత్తుల్లోకి విపరీతంగా పొగ
చూరగొనడంతో అస్వస్థతపాలయ్యారు. మంటలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా అగ్నిమాపక
సిబ్బంది కట్టడి చేశారు. తీవ్రంగా శ్రమించి వసతి గృహ భవనంలో మంటల్ని అదుపులోకి
తెచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరావాల్సి ఉందని ఢిల్లీ ఫైర్ సర్వీస్(డి.ఎఫ్.ఎస్) చీఫ్ ఆఫీసర్ అతుల్ గార్గ్ తెలిపారు. తమకు తెల్లవారు 3సమయంలో సమాచారం అందగా వెంటనే అక్కడకు అగ్నిమాపక శకటాలతో సిబ్బంది చేరుకున్నారన్నారు. మంటల్ని 3.30 సమయానికి పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.