పాక్ సుప్రీంకోర్టు లో తొలిసారి ఈ-కోర్టు కేసు విచారణ
పాకిస్థాన్
న్యాయ వ్యవస్థ చరిత్రలో సోమవారం (మే27) కొత్త అధ్యాయం ప్రారంభమయింది. ఆ దేశ
సుప్రీంకోర్టు తొలిసారిగా ఈ-కోర్టు పద్ధతిలో కేసు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి(సీజే)
జస్టిస్ ఆసిఫ్ సయీద్ ఖోసా నేతృత్వంలో జస్టిస్ తారిఖ్ మసూద్, జస్టిస్ మజర్ అలాం
ఖాన్ మయిన్ఖేల్ లతో కూడిన ఇస్లామాబాద్ లోగల సుప్రీం కోర్టు ధర్మాసనం ఈ వినూత్న
ప్రయోగానికి తెరతీసింది. సుప్రీంకోర్టు కరాచీ రిజిస్ట్రీ నుంచి న్యాయవాది ఆన్ లైన్
లో కేసును సుప్రీం ధర్మాసనం ముందుంచారు. సుప్రీంకోర్టు హాల్ లో కంప్యూటర్ కు
అనుసంధానం చేసిన వీడియో లింక్ ద్వారా విచారణ కొనసాగించారు. ఈ సౌకర్యంతో పలువురు
న్యాయవాదులు, కక్షిదారులూ లబ్ధి పొందగలరని భావిస్తున్నారు. విలువైన సమయం, ధనం
కలిసి వస్తాయని ఆశిస్తున్నారు. చీఫ్ జస్టిస్ గా పదవిలోకి వచ్చిన ఖోసా
జనవరిలోనే కొండల్లా పేరుకున్న కేసులు, విచారణ జాప్యాలను త్వరలో నివారించాల్సి ఉందని
పేర్కొన్నారు. సంస్థాగతంగా ఓ క్రమపద్ధతిలో కేసుల విచారణ పురోగతి సాధించాలని
అభిప్రాయపడ్డారు. అనవసర ఆలస్యాల నివారణ, వ్యాజ్యాల కుదింపు, పనిభారం తగ్గింపు దిశగా
ముందడుగు వేయాలని చీఫ్ జస్టిస్ ఖోసా పేర్కొన్నారు. పాత, కొత్త కేసుల విచారణను
ఎటువంటి జాప్యం లేకుండా ఇకపై ఈ-కోర్టు ద్వారా చకచకా నిర్వహించే వీలుకల్గుతుందని పాక్
న్యాయవ్యవస్థ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి.