లక్ష కి.మీ. ప్రయాణాన్ని పూర్తి
చేసుకున్న `వందే భారత్`
న్యూఢిల్లీ-వారణాసిల మధ్య నడుస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు లక్ష
కిలోమీటర్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో దేశీయంగా నిర్మితమైన ఈ హైస్పీడ్ రైలు ఫిబ్రవరి
15న ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. శతాబ్ది ఎక్స్ ప్రెస్ కు
ప్రత్యామ్నాయంగా వందే భారత్ పేరిట ఈ రైలు దేశ రాజధాని ఢిల్లీ ఆధ్యాత్మిక రాజధాని
వారణాసి మధ్య వారానికి అయిదు రోజులు
ప్రయాణిస్తోంది. తొలిరోజు తిరుగు ప్రయాణంలో మాత్రం కాన్పూర్ వద్ద స్వల్ప అంతరాయంతో
కొద్ది సేపు నిలిచిపోవడం మినహా ఇప్పటి వరకు వందే భారత్ సజావుగా ప్రయాణం
సాగిస్తోంది. చెన్నై లోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ఐ.సి.ఎఫ్) నుంచి రెండో దశలో
రూపుదిద్దుకున్న ఈ రైలు కోచ్ లు మే నెలాఖరుకు ఢిల్లీ చేరనున్నాయి. తొలిదశ కోచ్ లలో
కనిపించిన లోటుపాట్లను సరిచేసి మరిన్ని సౌకర్యాలతో కొత్త కోచ్ లను సిద్ధం చేశారు. ఈ రైలూ ఢిల్లీ-వారణాసి మధ్యే పరుగులు తీయనుంది. తర్వాత దశల వారీగా అన్ని
ప్రధాన మార్గాల్లో వందే భారత్ ప్రయాణించనుంది.