Thursday, May 9, 2019

indian christian serves iftar to nearly 800 muslim workers

యూఏఈలో ఇఫ్తార్ విందు ఇచ్చిన భారతీయ క్రైస్తవ వ్యాపారవేత్త


యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లో వ్యాపారం నిర్వహిస్తున్న భారతీయ క్రిస్టియన్ సాజి చెరియన్(49) రంజాన్ సందర్భంగా సంస్థలోని సిబ్బందికి బుధవారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. ముస్లింల పవిత్ర రంజాన్ మాసం ఈ నెల 7 బుధవారం ప్రారంభమైన సంగతి తెలిసిందే. కేరళలోని కాయంకుళంకు చెందిన సాజి గత ఏడాది ఇక్కడ సుమారు రూ.కోటి 96 లక్షలతో (1.3 మిలియన్ దిర్హామ్) మసీదు నిర్మించారు. తమ సంస్థలో పనిచేసే ఒక్కో ఉద్యోగి నెలకు రూ.15 వేలు(800 దిర్హామ్లు) సంపాదిస్తారు. వారు ప్రతి రంజాన్ మాసంలో సమీపంలోని మసీదులకు టాక్సీల్లో రోజూ ప్రార్థనలకు వెళ్లి రావడానికి రూ.380(20  దిర్హామ్లు) ఖర్చు చేస్తుండడాన్ని గమనించిన ఆయన వారికి ఆ ఖర్చులు లేకుండా చేయాలని మసీదు నిర్మించారని తెలుస్తోంది. 2003లో యూఏఈ(దుబాయ్) చేరిన సాజి సొంతంగా వ్యాపారవేత్తగా ఎదిగారు. తమ సంస్థలో పనిచేసే సిబ్బందికి ఉచిత నివాస సదుపాయాన్ని కల్పించారు. ఫుజర్హాలో ఆయన ఇచ్చిన ఇఫ్తార్ విందులో సంస్థలో పనిచేసే 800 మంది సిబ్బందితో పాటు సమీప కంపెనీలకు చెందిన సీనియర్ ఉద్యోగులు పలువురు పాల్గొన్నారు. గత ఏడాది రంజాన్ సందర్భంగా ప్రారంభించిన మసీదులో ఈ రంజాన్ మాసం అంతా ప్రార్థనల్లో పాల్గొనే ముస్లిం సోదరులందరికీ ఇఫ్తార్ విందు ఇవ్వనున్నట్లు ఈ సందర్భంగా సాజి తెలిపారు. ఖర్జురాలు, తాజా పండ్లు, చిరు ఆహార పదార్ధాలు, పండ్ల రసాలులతో విందు నిర్వహిస్తామన్నారు. రకరకాల బిర్యానీలను రుచి చూపించనున్నట్లు చెప్పారు. విందులో తరతమ స్థాయీ భేదాల్లేకుండా సిబ్బంది, ఉన్నతోద్యోగులంతా ఒక్కచోట చేరి ఇఫ్తార్ విందు ఆరగించడం ఆనందాన్నిస్తోందని సాజి పేర్కొన్నారు. అల్ హయల్ ఇండస్ట్రియల్ ఏరియాలోని ఈస్ట్ విల్లే రియల్ ఎస్టేట్ కాంప్లెక్స్ లోగల మసీదులో 250 మంది ఒకేసారి ప్రార్థనల్లో పాల్గొనే అవకాశం ఉంది. దాన్ని ఆనుకుని ఉన్న మైదానంలో ఒకేసారి మరో 700 మంది ప్రార్థనల్లో పాల్గొనవచ్చని సాజి వివరించారు. పాకిస్థాన్ కు చెందిన బస్ డైవర్ అబ్దుల్ ఖయ్యూం(63) సాజి ఇఫ్తార్ విందు నిర్వహణ ఆమోఘంగా ఉందని కొనియాడారు. ఇటువంటి మంచి వ్యక్తులు ఇంకా ఉండబట్టే ప్రపంచం ఇంకా మనుగడ సాగిస్తోందని ఉద్వేగంతో పేర్కొన్నారు.


Wednesday, May 8, 2019

Kejriwal, Prakash Raj campaign in West Delhi


ఢిల్లీలో కేజ్రీవాల్ తో కలిసి ప్రకాశ్ రాజ్ ప్రచారం
ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్ అధినేత) కేజ్రీవాల్ తో కలిసి దక్షిణాది ప్రముఖ నటుడు తాజాగా రాజకీయాల్లోకి ప్రవేశించిన ప్రకాశ్ రాజ్ బుధవారం (మే8) ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆప్ పశ్చిమ ఢిల్లీ అభ్యర్థి బల్బీర్ సింగ్ జకర్ ను వెంటబెట్టుకుని ఈ ఇద్దరు నేతలు ఉత్సాహంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆప్ అభ్యర్థి కి ఓటేసి గెలిపించాలని ప్రకాశ్ రాజ్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. నిజమైన సమస్యల్ని పేర్కొంటున్న వాటిని తీర్చేందుకు ప్రయత్నిస్తోన్న ఏకైక పార్టీ ఆప్ మాత్రమేనని ప్రకాశ్ రాజ్ ప్రశంసించారు. బల్బీర్ ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థి మహాబల్ మిశ్రా, బీజేపీ సిట్టింగ్ అభ్యర్థి పర్వేశ్ సింగ్ వర్మలతో త్రిముఖ పోటీ ఎదుర్కొంటున్నారు. ఆప్ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో రెండు సార్లు ప్రచారం నిర్వహించింది. తొలి విడత ప్రచారం మార్చి10న మొదలు పెట్టి ఏప్రిల్ 7 వరకు రెండోసారి ఏప్రిల్ 25 వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ఢిల్లీలో ఎన్నికలు ఆరో విడతగా మే12న జరగనున్నాయి.   

Tuesday, May 7, 2019

amith shah calls modi 'arjuna' to counter priyanka's 'duryodhana' remark on modi


ప్రియాంక జీ.. మీకు మే23 తర్వాత తెలుస్తుంది
కాంగ్రెస్ యువనేత ప్రియాంక గాంధీపై భారతీయ జనతాపార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఎదురుదాడికి దిగారు. మంగళవారం (మే7) హర్యానాలోని అంబాలాలో ప్రియాంక ఎన్నికల ప్రచార సభలో మోదీ అహంకారాన్ని దుర్యోధనుడి అహంకారంతో పోలుస్తూ వ్యాఖ్యానించిన కొన్ని క్షణాల్లోనే బీజేపీ నాయకులు, శ్రేణులు ఆమెపై విమర్శనాస్త్రాలు సంధించడం ప్రారంభించారు. అధ్యక్షుడు అమిత్ షా అయితే ఒకడుగు ముందుకు వేసి మే 23 తర్వాత ఎన్నికల ఫలితాలు వచ్చాక మీకు తెలుస్తుందంటూ హెచ్చరించారు. పశ్చిమ బెంగాల్ లోని బెల్దా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ   ‘ప్రియాంక జీ.. ప్రధాని మోదీని దుర్యోధనుడితో పోల్చారు.. ఆయన చేసిన అభివృద్ధి ప్రజలకు తెలుసు వారే మీకు గుణపాఠం  చెబుతారు..’అని గట్టిగా బదులిచ్చారు. మోదీ అర్జునుడని 2019 ఎన్నికల్లోనూ విజయఢంకా మోగించనున్నారని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

protest over clean chit to cji in sexual harassment case


సీజేఐకు క్లీన్ చిట్ పై మహిళల నిరసన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) రంజన్ గొగొయ్ కి అంతరంగిక విచారణ సంఘం క్లీన్ చిట్ ఇవ్వడంపై మహిళలు నిరసనకు దిగారు. మంగళవారం (మే7) సుప్రీంకోర్టు ఆవరణలో పలువురు మహిళలు, న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. కనీసం విచారణ సంఘం ముందుకు బాధితురాల్ని హాజరుకానివ్వలేదని ఆరోపించారు. ఆందోళనకారులు నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అత్యంత ప్రముఖులు తిరిగే ప్రాంతం(వి.వి.ఐ.పి  జోన్) కావడం వల్ల ఢిల్లీ పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఉల్లంఘించిన పలువురు ఆందోళన కారుల్ని అరెస్ట్ చేసి అక్కడ నుంచి తరలించారు. విధివిధానాలు పూర్తయ్యాక పోలీసులు వారిని విడిచిపెట్టారు.