శ్రీలంకలో అమల్లోకి వచ్చిన బురఖాల నిషేధం
దేశంలో ఇటీవల
జరిగిన వరుస బాంబు పేలుళ్లకు పాల్పడిన ఉగ్రవాదులకు సహకరించిన వారిలో బురఖాలు
ధరించిన మహిళలున్నట్లు తేలడంతో శ్రీలంక వాటిపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఈ నిషేధం సోమవారం(ఏప్రిల్ 29) నుంచి అమల్లోకి వచ్చింది. శ్రీలంకలో చర్చిలు, అయిదు
నక్షత్రాల హోటళ్లలో వరుస బాంబు పేలుళ్లకు ఉగ్రవాదులు పాల్పడగా 300 మందికిపైగా
మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. కళ్లు మినహా మొహాన్ని పూర్తిగా కప్పి ఉంచే
బురఖాలు ధరించడం వల్ల వ్యక్తుల్ని గుర్తించడం కష్టతరంగా మారుతోందని అధ్యక్షుడు
సిరిసేన కార్యాలయం ఓ ప్రకటనలో వివరించింది. యూరప్ లో ఫ్రాన్స్, బెల్జియం,
ఆస్ట్రియాల్లో ఆత్మాహుతి బాంబు దాడుల నేపథ్యంలో ఆ దేశాల్లో పూర్తి మొహాన్ని కప్పి
ఉంచే బురఖాలపై నిషేధం అమలులో ఉంది. కెనడా
కూడా ఇదే రీతిగా బురఖాలపై నిషేధాస్త్రాన్ని ప్రయోగించింది. అధ్యక్షుడు సిరిసేన
ముస్లిం మహిళలు ధరించే సంప్రదాయ బురఖాల్ని నేరుగా ప్రస్తావించకుండా పూర్తి
మొహాల్ని కప్పి ఉంచే బురఖాలపై నిషేధాన్ని పార్లమెంట్ ద్వారా అత్యవసర చట్టంగా అమల్లోకి
తెస్తున్నట్లు పేర్కొన్నారు. పలువురు బురఖాలు ధరించిన తిరుగుతుండడం వల్ల నిందితుల్ని పట్టుకోవడంలో నిఘా వర్గాలు, పోలీసులు
సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. అనుమానిత ముస్లిం సంస్థ నేషనల్ తౌహీద్ జమాత్ తో
పాటు దాని అనుబంధ సంస్థని శ్రీలంక ఇప్పటికే నిషేధించింది. మరో వైపు దేశంలోని
సెయిలాన్ జమాయితుల్ ఉలుమాకు చెందిన మత ప్రవక్తలు పూర్తి మొహాల్ని కప్పి ఉంచే
బురఖాలు ధరించకుండా ముస్లిం మహిళలు భద్రతా బలగాలకు సహకరించాలని విన్నవించారు. శ్రీలంకలో
అల్పసంఖ్యాక వర్గాల్లో హిందువుల తర్వాత 9శాతం జనాభాతో ముస్లింలు రెండో స్థానంలో
ఉన్నారు. దేశంలో ఏడు శాతం క్రిస్టియన్లు ఉన్నారు.