Tuesday, April 16, 2019

Welcome to the World of Madame X Madonna to first track from new album


మడోనా కొత్త ఆల్బమ్ ‘వెల్ కం టు ది వరల్డ్ ఆఫ్ మేడమ్ ఎక్స్’
పాప్ సింగర్ మడోనా కొత్త ఆల్బమ్ ‘వెల్ కం టు ది వరల్డ్ ఆఫ్ మేడమ్ ఎక్స్’ తొలి పాట బుధవారం (ఏప్రిల్ 17) విడుదల కానుంది. ఈ ఆల్బమ్ టీజర్ ను సింగర్, డ్యాన్సరైన 60 ఏళ్ల మడోనా యూట్యూబ్ లో ఆదివారం విడుదల చేశారు. ఆమె ఈ ఆల్బమ్ లో టైటిల్ కేరక్టర్ పోషిస్తున్నారు. తనెవరో తెలియకండా జాగ్రత్తపడుతూ ప్రపంచమంతా మారు వేషాల్లో తిరిగే సీక్రెట్ ఏజెంట్.. స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వైనంపై బాణీలు కూర్చారు. అణగారిన సమాజంలో వెలుగుపూలు విరజిమ్మే పాత్రను పరిచయం చేస్తూ వీనులవిందయిన బాణీలతో మేడమ్ ఎక్స్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. మడోనాతో పాటు కొలంబియా సింగర్ మలుమ ఈ ఆల్బమ్ లో పాత్ర పోషిస్తున్నారు. తొలి పాటకు మెడెలిన్ గా పేరుపెట్టారు. మడోనా ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో మెడెలిన్ మ్యూజిక్ వరల్డ్ లో ఆసక్తిని రేపుతోంది. 2015లో ‘రెబల్ హార్ట్’ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ మడోనా నుంచి మేడమ్ ఎక్స్ ఆల్బమ్ రూపొందుతోంది.


Paris cathedral church caught under huge fire 850 years old landmark destroyed


పారిస్ లో పురాతన కేథడ్రాల్ చర్చి దగ్ధం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 850 ఏళ్ల నాటి అతి పురాతన కేథడ్రాల్ చర్చిలో సోమవారం(ఏప్రిల్15)రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. చర్చి ఆధునికీకరణ పనులు చేపట్టిన నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదవశాత్తునే అగ్ని ప్రమాదం సంభవించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అగ్నికీలలకు చర్చి చాలా భాగం కాలిపోయింది. చర్చి పైకప్పు ఆనవాళ్లు లేకుండా బూడిదైపోయింది. హెలికాప్టర్ ద్వారా కూడా మంటల్ని అదుపు చేస్తున్నారు. వందలమంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే పనిలో నిమగ్నమయ్యారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు చేపట్టారు. వేలమంది జనం చర్చి దగ్ధమవుతున్న దృశ్యాలను తిలకిస్తూ ఆ ప్రాంతంలో గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మంటల్ని అదుపు చేసే క్రమంలో తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే మంటలు పూర్తిగా అదుపులోకి రాగలవని భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇతరులెవరూ గాయపడలేదని వార్తా సంస్థల కథనం. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ అగ్నిమాపక సిబ్బంది తెగువను, కృషిని ప్రశంసించారు. ఫ్రెంచి సంస్కృతికి చిహ్నమైన గోథిక్ చర్చిలో అగ్నిప్రమాదం జరిగిన ఈరోజు అత్యంత దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు. 

Monday, April 15, 2019

cricket world cup 2019 team india the men in blue


వరల్డ్ కప్ భారత జట్టును ప్రకటించిన బీసీసీఐ సెలెక్టర్లు
క్రికెట్ మక్కా ఇంగ్లండ్‌లో మే30 నుంచి ప్రారంభం కానున్న ప్రపంచ్ కప్‌కు భారత జట్టును సెలక్షన్ కమిటీ సోమవారం (ఏప్రిల్15) ప్రకటించింది. ముంబయిలో చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ నేతృత్వంలోని ఎంపిక సంఘం సమావేశమైంది. ఈ సమావేశానికి కెప్టెన్ విరాట్ కోహ్లీ హాజరయ్యారు. చర్చల అనంతరం 15 మంది సభ్యుల జట్టును ప్రకటించారు. టీమిండియా కెప్టెన్‌గా విరాట్‌ కోహ్లీ, వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించనున్నారు. దినేశ్ కార్తీక్‌కు రిజర్వ్ వికెట్ కీపర్‌గా స్థానం లభించింది. యువ కీపర్ బ్యాట్స్ మన్ రిషబ్ పంత్‌(21)కు స్థానం దక్కలేదు. మ్యాచ్‌లో ధోనీ ఆడని పక్షంలో ఆ స్థానాన్ని దినేశ్ కార్తీక్ చక్కగా భర్తీ చేయగలడని అతనిపై సెలెక్టర్లు భరోసా ఉంచారు. సీనియర్టీతో పాటు లక్ష్య చేధన సమయంలో కూల్ గా బ్యాటింగ్ చేయడంలో దినేశ్ కార్తీక్ దిట్టని అతణ్ని ఎంపిక చేశారు. మిగిలిన సీనియర్ ఆటగాళ్లు సురేశ్ రైనా, అంబటి రాయుడు, రవిచంద్రన్ అశ్విన్‌, ఉమేశ్ యాదవ్‌ల ఎంపికను సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. అయిదుగురు స్పెషలిస్టు బ్యాట్స్ మెన్, ముగ్గురు స్పిన్నర్లు, ముగ్గురు పేసర్లు, ఇద్దరు వికెట్ కీపింగ్ స్పెషలిస్టులు, ఇద్దరు ఆల్ రౌండర్ల కూర్పుగా జట్టును ప్రకటించారు. ఇందులో మూడు విభాగాల నుంచి ఎంపికలో విజయ్ శంకర్ నిలవడం విశేషం. స్పెషలిస్ట్ కీపింగ్ బ్యాట్స్ మెన్ గా ధోని, దినేశ్ లు, ఆల్ రౌండర్లుగా జడేజా, హార్దిక్, మీడియం పేసర్లుగా షమీ,భువనేశ్వర్, బుమ్రాలు టాప్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ గా ధావన్, రోహిత్, రాహుల్, కోహ్లీ, విజయ్ శంకర్ జట్టుకు ఎంపికయ్యారు.
భారత జట్టు
విరాట్ కోహ్లీ (కెప్టెన్ ), రోహిత్ శర్మ (వైస్ కెప్టెన్), మహేంద్ర సింగ్ ధోనీ, శిఖర్ ధావన్, కేఎల్ రాహుల్,
విజయ్ శంకర్, కేదార్ జాదవ్, దినేశ్ కార్తీక్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, భువనేశ్వర్ కుమార్,
జస్ప్రిత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ.

huge fire in ntr electronic shopping complex at vijayawada due to electric short circuit


ఎన్టీయార్ కాంప్లెక్స్ లో భారీ అగ్ని ప్రమాదం
విజయవాడలోని అతి పెద్ద ఎలక్ట్రానిక్ షాపింగ్ ప్రాంగణం ఎన్టీయార్ కాంప్లెక్స్ లో సోమవారం (ఏప్రిల్15) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం షాప్ నెం.72లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధమయింది. అన్నీ ఎలక్ట్రానిక్ వస్తువులు, వైర్లు కావడంతో వస్తువులు మొత్తం భస్మీపటలం అయ్యాయి. గోడౌన్ కూడా షాపునకు ఆనుకునే ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించినట్లు సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనా ప్రకారం రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.  ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు బయటికి పరుగులు తీశారు. ఈ కాంప్లెక్స్ లో 150కి పైగా ఎలక్ట్రానిక్ షాపులున్నాయి. పెద్ద సంఖ్యలో గోడౌన్లు కూడా ఇదే కాంప్లెక్స్ లో ఉన్నాయి. అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సకాలంలో చేరుకోని మంటల్ని అదుపుచేశారు. లేదేంటే మంటలు కాంప్లెక్స్ లోని మిగిలిన షాప్ లకు వ్యాపించి ఉంటే నష్టం అంచనాలకు అందందని స్థానికులు వ్యాఖ్యానించారు.