పారిస్ లో పురాతన కేథడ్రాల్
చర్చి దగ్ధం
ఫ్రాన్స్ రాజధాని పారిస్ లో 850 ఏళ్ల నాటి అతి పురాతన కేథడ్రాల్ చర్చిలో
సోమవారం(ఏప్రిల్15)రాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. చర్చి ఆధునికీకరణ పనులు చేపట్టిన
నేపథ్యంలో ఈ అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం. ప్రమాదవశాత్తునే అగ్ని ప్రమాదం
సంభవించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అగ్నికీలలకు చర్చి చాలా భాగం
కాలిపోయింది. చర్చి పైకప్పు ఆనవాళ్లు లేకుండా బూడిదైపోయింది. హెలికాప్టర్ ద్వారా
కూడా మంటల్ని అదుపు చేస్తున్నారు. వందలమంది అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పే
పనిలో నిమగ్నమయ్యారు. మంటలు చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా చర్యలు
చేపట్టారు. వేలమంది జనం చర్చి దగ్ధమవుతున్న దృశ్యాలను తిలకిస్తూ ఆ ప్రాంతంలో
గుమిగూడారు. అగ్నిమాపక సిబ్బందిలో ఒకరు మంటల్ని అదుపు చేసే క్రమంలో తీవ్రంగా
గాయపడినట్లు తెలుస్తోంది. మరికొద్ది గంటల్లోనే మంటలు పూర్తిగా అదుపులోకి రాగలవని
భావిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఇతరులెవరూ గాయపడలేదని వార్తా సంస్థల కథనం. ఫ్రాన్స్
అధ్యక్షుడు ఇమాన్యుల్ మెక్రాన్ అగ్నిమాపక సిబ్బంది తెగువను, కృషిని ప్రశంసించారు.
ఫ్రెంచి సంస్కృతికి చిహ్నమైన గోథిక్ చర్చిలో అగ్నిప్రమాదం జరిగిన ఈరోజు అత్యంత
దురదృష్టకరమైన రోజుగా పేర్కొన్నారు.