ఎన్టీయార్ కాంప్లెక్స్ లో భారీ
అగ్ని ప్రమాదం
విజయవాడలోని అతి పెద్ద ఎలక్ట్రానిక్ షాపింగ్ ప్రాంగణం ఎన్టీయార్
కాంప్లెక్స్ లో సోమవారం (ఏప్రిల్15) భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఉదయం షాప్
నెం.72లో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగి షాప్ పూర్తిగా దగ్ధమయింది. అన్నీ
ఎలక్ట్రానిక్ వస్తువులు, వైర్లు కావడంతో వస్తువులు మొత్తం భస్మీపటలం అయ్యాయి. గోడౌన్
కూడా షాపునకు ఆనుకునే ఉండడంతో మంటలు త్వరగా వ్యాపించినట్లు సమాచారం. విద్యుత్
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. ప్రాథమిక అంచనా
ప్రకారం రూ.10లక్షల ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వ్యాపారులు బయటికి
పరుగులు తీశారు. ఈ కాంప్లెక్స్ లో 150కి
పైగా ఎలక్ట్రానిక్ షాపులున్నాయి. పెద్ద సంఖ్యలో గోడౌన్లు కూడా ఇదే కాంప్లెక్స్ లో
ఉన్నాయి. అగ్నిమాపక శకటాలతో సిబ్బంది సకాలంలో చేరుకోని మంటల్ని అదుపుచేశారు. లేదేంటే
మంటలు కాంప్లెక్స్ లోని మిగిలిన షాప్ లకు వ్యాపించి ఉంటే నష్టం అంచనాలకు అందందని
స్థానికులు వ్యాఖ్యానించారు.