దేశ నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సోమవారం ఉదయం 10.15కి ఆమెతో భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్.వి.రమణ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమం సందర్భంగా వేదికపై ముర్ముతో పాటు, సీజేఐ జస్టిస్ రమణ, రామ్ నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, స్పీకర్ ఓం బిర్లా ఆశీనులయ్యారు. వేదిక కింద ముందు వరుసలో ప్రధాని నరేంద్రమోదీ, సోనియాగాంధీ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్, ప్రతిభాపాటిల్, కేంద్రమంత్రులు రాజ్ నాథ్ సింగ్, అమిత్ షా, స్మృతి ఇరానీ తదితరులు కూర్చున్నారు. పెద్ద సంఖ్యలో ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత ఈ ఉదయం 8.30కి ముర్ము రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధిని సందర్శించి జాతిపితకు నివాళులర్పించారు. అనంతరం ఆమె తన తాత్కాలిక నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత పార్లమెంట్ కు విచ్చేశారు. ఆమెను సెంట్రల్ హాల్ లోని ప్రమాణ స్వీకార వేదిక వద్దకు రామ్ నాథ్ కోవింద్, వెంకయ్యనాయుడు, జస్టిస్ రమణ, ఓం బిర్లా తోడ్కొని వచ్చారు. ప్రమాణ స్వీకారం తర్వాత ముర్ము మాట్లాడుతూ ఆజాదికీ అమృత మహోత్సవాలు జరుగుతున్న వేళ భారత రాష్ట్రపతిగా పదవి చేపట్టడంతో అమితానందం కల్గుతోందన్నారు. ఇందుకు దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఒడిశా నీటిపారుదల శాఖలో ఓ సాధారణ క్లర్కుగా జీవితం ప్రారంభించిన ఆమె దేశ ప్రథమ పౌరురాలి స్థాయికి చేరుకున్నారు. రాజకీయాల్లో తను కౌన్సిలర్ స్థానం నుంచి రాష్ట్రపతి స్థాయికి చేరుకోవడం ముదావహమని ముర్ము అన్నారు. భారత ప్రజాస్వామ్యం గొప్పతనానికి ఇదే నిదర్శనమని సగర్వంగా ప్రకటించారు. ప్రపంచంలోనే భారత్ ఓ అమేయశక్తిగా అవతిరించిందని పేర్కొన్నారు. రాబోయే 25 ఏళ్లల్లో దేశం మరింతగా పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. అందుకు అందరూ సహకరించాలన్నారు. దేశ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి అహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్రపతి ముర్ము తెలిపారు.
Monday, July 25, 2022
Droupadi Murmu to take oath as President followed by 21-gun salute
Friday, July 15, 2022
andhra pradesh cm ys jagan conducts aerial survey of flood hit areas
గోదావరి వరద ప్రాంతాల్లో సీఎం ఏరియల్ సర్వే
గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఏపీ సీఎం వై.ఎస్.జగన్ శుక్రవారం ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ ఉదయం విశాఖపట్టణంలో వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం అక్కడ నుంచి నేరుగా జగన్ హెలికాఫ్టర్లో గోదావరి ముంపు గ్రామాల పర్యటనకు బయలుదేరారు. వరద పరిస్థితిపై ఏరియల్ సర్వే నిర్వహించారు. భద్రాచలం వద్ద గోదావరి ఉద్ధృతి కొనసాగుతున్న నేపథ్యంలో పోలవరంతో పాటు గోదావరి పరీవాహక ప్రాంతాల్లో వరద ముంపు పరిస్థితిని సీఎం జగన్ పరిశీలించారు. ముఖ్యమంత్రి వెంట హోంమంత్రి తానేటి వనిత ఉన్నారు. అనంతరం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి చేరుకుని అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరదలపై ప్రభావిత జిల్లాల అధికార యంత్రాంగం అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశించారు. ఆ మేరకు పోలవరం, ధవళేశ్వరం వద్ద ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ దిగువ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలని చెప్పారు. వరద ప్రభావిత జిల్లాల కలెక్టర్లు, అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉంటూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి అక్కడ వారికి సహాయ శిబిరాలను ఏర్పాటుచేయాలన్నారు. అలాగే వరద పరిస్థితి కొలిక్కివచ్చే వరకు వారికి తగిన సౌకర్యాలను కల్పించాలని సూచించారు.
Friday, July 8, 2022
Vijayamma resigns from YSRCP, announces support for daughter Sharmila
Vijayamma
resigns from YSRCP, announces support for daughter Sharmila
వైఎస్ ఆర్ సీపీకి విజయమ్మ రాజీనామా
ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ తన కుమార్తె వై.ఎస్. షర్మిలకు బాసటగా నిలవాలని నిర్ణయించుకున్నారు. ఇటీవల తెలంగాణలో వైఎస్ఆర్ టీపీ ని నెలకొల్పిన తనయ షర్మిల కోసం పూర్తి సమయాన్ని వెచ్చించాలని కోరుకుంటున్న ఆమె ఏపీ రాజకీయాల నుంచి వైదొలుగుతున్నట్లు శుక్రవారం ప్రకటించారు. వై.ఎస్.ఆర్.సి.పి. గౌరవ అధ్యక్షరాలి పదవి నుంచి తప్పుకుంటున్నానన్నారు. తనను అందరూ క్షమించాలని కోరారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణం ఎదుట ప్రస్తుతం జరుగుతున్న వై.ఎస్.ఆర్.సి.పి. ప్లీనరీ సమావేశాల్లో విజయమ్మ రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి ఏర్పాటు చేసిన సమావేశాలకు హాజరయిన ఆమె ఆ హోదాలో తుది ప్రసంగం చేశారు. వై.ఎస్ ఆకస్మిక మరణం దరిమిలా కుమారుడు వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి కి కష్టాలు ఎదురైనప్పుడు తనతో పాటు షర్మిల, యావత్ కుటుంబం ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన సంగతిని విజయమ్మ గుర్తు చేశారు. ఇప్పుడు టీఎస్ లో కుమార్తె షర్మిల వై.ఎస్ ఆశయసాధనకు పాటుపడుతోందని అందుకే ప్రస్తుతం ఆమెకు చేయూత అవసరమన్నారు. అందువల్ల రెండు పార్టీల్లో కొనసాగడం మంచిది కాదని తన అంతరాత్మ ప్రబోధిస్తున్నందున ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విజయమ్మ వివరించారు.