పవన్ కల్యాణ్@50
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ 50వ పుట్టినరోజుని ఆయన అభిమానులు, కుటుంబసభ్యులు ఘనంగా జరుపుకుంటున్నారు. గురువారం ఆయన బర్త్ డే సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి `తమ్ముడు నిప్పు కణం` అంటూ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. `సినీ కథానాయకులు, ప్రజా నాయకులు పవన్ కల్యాణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను` అంటూ ఏపీ మాజీ సీఎం తెలుగుదేశం పార్టీ జాతీయఅధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, అల్లు అర్జున్, అనసూయ, శ్రీముఖిలతో పాటు పలువురు పవన్‌కి విషెస్ అందించారు. `హ్యాపీ బర్త్‌డే బాబాయ్.. అన్ని విషయాల్లో మీకు మంచి జరగాలని, విజయం వరించాలని కోరుకుంటున్నా` అని వరుణ్ తేజ్ శుభాకాంక్షలు తెలిపారు. మరో వైపు పవన్, రానాల తాజా సినిమా భీమ్లా నాయక్ కు సంబంధించిన టైటిల్ సాంగ్ ని చిత్ర యూనిట్ అభిమానులకు బర్త్ డే కానుకగా విడుదల చేసింది. ఆ సాంగ్ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.